19వ అధ్యాయము - మునుల వాగ్వాదము
గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువయను వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప ధనమును బిగ్గరగా యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు వారి దండములను, ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.
ఇట్లు వారు పరస్పరము వివదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు 'నారదా! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతదు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి వివాదపదుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.
కొంతకాలము గడచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని జూచి యెదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి సనకాది మునులాశ్చర్య పడి యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి? వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతివాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.
ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యముకాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.
మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు, నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే, నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యుండని ప్రార్థించిరి.
నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంతచిత్తులై పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధరూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి యిహలోక సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయవివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.
No comments:
Post a Comment