Thursday, February 21, 2013

మాఘ పురాణం - 13

13వ అధ్యాయము - సుశీలుని కథ


రాజా! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను, ఉన్నతములగు వృక్షములతోను, పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెడకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి యవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.

కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ! నీవెవరవు? నీకీ పరిస్థితియేమి? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను, ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన, దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.

సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే, వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.

సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని, కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక, పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నంది పుణ్యలోకముల నందుదురు. స్నానము యేడు విధములు. అవి,
  • మంత్రములను చదువుచు చేయు స్నానము, మంత్రస్నానము.
  • మట్టిని రాచుకొని చేయు స్నానము, మృత్తికాస్నానము.
  • భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము, ఆగ్నేయస్నానము.
  • గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము, వాయవ్యస్నానము.
  • నదులు, చెరువులు మున్నగువానిలో చేయు స్నానము, వరుణ స్నానము.
  • ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము, దివ్యస్నానము.
  • మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము, మానసస్నానము.

ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును, జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.

స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి, ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను, ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను, నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును, పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.

స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని, గంగను, దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.

No comments:

Post a Comment