15వ అధ్యాయము - జ్ఞానశర్మకథ - మాఘపూర్ణిమ
గృత్నృమదుడుజహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమచరించితిని యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు 'స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితిని, నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.
అప్పుడు శ్రీహరి 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే యిప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.
ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివరికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.
బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుదును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుదు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విదిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.
No comments:
Post a Comment