Showing posts with label వైశాఖ పురాణం. Show all posts
Showing posts with label వైశాఖ పురాణం. Show all posts

Wednesday, June 5, 2013

వైశాఖ పురాణం - 30

30వ అధ్యాయము - పుష్కరిణి - ఫలశ్రుతి

నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.

దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని  యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.

శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.

మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.

నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.

ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.

Tuesday, June 4, 2013

వైశాఖ పురాణం - 29

29వ అధ్యాయము - శునీ మోక్షప్రాప్తి

నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.

మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.

పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె యిచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని యారోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని యింట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.

ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి యరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి యరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు.

అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి యేమని పుత్రుని యడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని యాశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు యిట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే యున్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచిదేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా! కావున నేను దీనురాలై అడుగుచున్న యీ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి యుద్దరింతును అని పలికెను.


ఇట్లు పలికి ద్వాదశినాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్ళు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను దెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్యవిమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములననుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవమునుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్దినందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి, యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిధిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిధి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటె సమస్త యజ్ఞయాగాదులకంటె అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వైశాఖశుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.

Monday, June 3, 2013

వైశాఖ పురాణం - 28

28వ అధ్యాయము - అక్షయతృతీయ విశిష్టత

నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.

పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.

ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.

ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.

ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు  చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.

Sunday, June 2, 2013

వైశాఖ పురాణం - 27

27వ అధ్యాయము - కలిధర్మములు - పితృముక్తి

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.

అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలని ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.

పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరునుండరని భావము.

దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు(భార్యలేనివారు), స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును. ఆ తిధినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.

ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.

అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించినవచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.

ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ యీ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.

ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.

భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.

జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.

ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక యెలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన యెలుకగడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.

ధర్మవర్ణుడును దీనులై ,యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను యిది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును యీ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన యీ గడ్డికి అంకురములులేవు. ఈ యెలుక యీ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ యెలుక మిగిలిన యీ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.

కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన యెలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ యెలుకయే కాలము. ఇప్పటికి యీ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు యిందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగువి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.

తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.

ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై యిట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము యిష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.


ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని యెట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణుకథలయందనురక్తి, స్మరణము, సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని యింటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.

ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.

Saturday, June 1, 2013

వైశాఖ పురాణం - 26

26వ అధ్యాయము - వాల్మీకి జన్మ

నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.

తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.

శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.

ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.

ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టుతొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.

శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.

ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!

శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.


ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.

శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.

అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట  బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.


అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.

కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.

శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

Friday, May 31, 2013

వైశాఖ పురాణం - 25

25వ అధ్యాయము - భాగవత ధర్మములు

నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.

స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.

అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.

రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.

సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.

సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను - అశుభములను, సుఖమును - దుఃఖమును, మంచిని - చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.

కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.

మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావరజంగమములన్నియు లోకములతో బాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును.

తత్త్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతోబాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యధాప్రకారముగ జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మసృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను శ్రీహరి యవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మ కల్పము ముగియు వరకునుందురు. ఆయా రాశులయందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేదధర్మములననుసరించు నాయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు.

కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచగణముల యందున్నవారు తమ కర్మలననుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు.

బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తి కాలమును వినుము. శ్రీమహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరల కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగినవారు, లింగశరీరులు లింగశరీర భంగమైనవారునగు జీవులనేకులుందురు.

శ్రీమహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగ నున్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు లింగభంగశరీరులు పిపీలికాదిమానవాంత జీవులు, ముక్తినందినవారు, బ్రహ్మ మొదలు మానవులవరకు నుండు జీవులు వీరందరునుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యము నిచ్చును. కొందరికి తత్త్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారివారికి తగినట్లుగ అనిరుద్ద వ్యూహముననుసరించి వారి వారికి యిచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయజయకృతిశాంతియను నాలుగు శక్తులను, వాసుదేవ అనిరుద్ద ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహములనుండి వరించెను. ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీమహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను.

యోగమాయను నాశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి యగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదుల కైనను యెరుగరావు అని శంఖుడు వివరించెను.

అప్పుడు కిరాతుడు స్వామీ! శ్రీమహావిష్ణువున కిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను. దయయుంచి చెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. చిత్తశుద్దిని కలిగించి సజ్జనులకుపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శ్రుతిప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్దము కానిదియగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణములచేత, బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్యనైమిత్తిక కామ్యములని మూడు రీతులుగ విభక్తములైనవి. నాలుగు వర్ణములవారును తమ తమ ధర్మములనాచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచోనవి సాత్విక ధర్మములని యందును. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములనియనిరి.


శ్రీమహావిష్ణువును విడిచి మరియొక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువు నందును, నాలుక శ్రీహరి నామోచ్ఛారణయందును హృదయము విష్ణుపాదముల యందును సక్తములై యుండునో వారే భాగవతులు. సదాచారములయందాసక్తి కలిగి అందరికి నుపకారమును చేయుచు, మమకారము లేనివారు భాగవతులు. వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగాగలవి రాజసధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు సత్త్వగుణము కలవారు. విష్ణుప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగజేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు భక్తులు.

వేదశాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతికరములైన ధర్మముల నాచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తిలేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నియు జ్ఞానులకుపయోగింపవు. చంద్రుని జూచి చంద్రకాంత శిలద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును.

ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుటవలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్దతో కూడి విష్ణుప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.

బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.


ఈ విధముగ శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.


శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |
సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |
దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||

పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.


శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |
సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||
తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |
ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||

చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.

అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.

Thursday, May 30, 2013

వైశాఖ పురాణం - 24

24వ అధ్యాయము - వాయుశాపము

అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.

శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.

శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.

బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.

ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.

అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.

స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.

శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెరును ప్రాణమును తిరస్కరింపలేరు.

ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.

అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.

ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

Wednesday, May 29, 2013

వైశాఖ పురాణం - 23

23వ అధ్యాయము - కిరాతుని పూర్వజన్మ

నారదుడంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.

కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.


అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.

ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.

ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.


నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

Tuesday, May 28, 2013

వైశాఖ పురాణం - 22

22వ అధ్యాయము - దంతిల కోహల శాపవిముక్తి

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.

శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.

పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.

అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.

శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.

శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.

కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు మంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.

ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.

కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.

Monday, May 27, 2013

వైశాఖ పురాణం - 21

21వ అధ్యాయము - పాంచాలరాజు సాయుజ్యము

నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.

పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి  నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.

నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1
ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2
సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3
తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4
ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5
భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6
తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7
వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8
తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9
ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10
నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11
త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12
నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13
పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14
పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15
సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16
సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17
ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18
అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19
ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20
భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21
ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22
కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23
హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24
త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25
అని స్తుతించెను.

పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే. 
  1. స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.
  2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.
  3. స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.
  4. తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.
  5. స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.
  6. నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.
  7. ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.
  8. ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.
  9. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.
  10. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.
  11. స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.
  12. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.
  13. స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.
  14. నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.
  15. స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.
  16. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.
  17. ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.
  18. స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.
  19. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.
  20. జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.
  21. ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.
  22. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.
  23. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.
  24. నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.
  25. ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.
ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును. ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.


వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.

పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.