Thursday, February 28, 2013

మాఘ పురాణం - 20

20వ అధ్యాయము - శివ బ్రహ్మల వివాదము

గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్తుడైన యధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.


ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగుదిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని, చివరనుగాని చూదలేకపోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.


ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుదు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు, స్వయంప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు, మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.



బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి


అనంతమూర్తీ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.

హేవిషోవంతమూర్తే తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం
సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |
అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం
చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||
నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై
త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |
పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః
ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||
త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః
గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |
త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట
దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||
లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర
త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః 

సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ
త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||
త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ
త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||
పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం
త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||
వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ
కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||
నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః
రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||
అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం
తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||
తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే
తూర్ణం జగనాథ మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. స్త్త్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి, యిహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును యీగుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుదు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా!

అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో నిట్లనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని.మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.

Wednesday, February 27, 2013

మాఘ పురాణం - 19

19వ అధ్యాయము - మునుల వాగ్వాదము


గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువయను వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప ధనమును బిగ్గరగా యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు వారి దండములను, ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు 'నారదా! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతదు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి వివాదపదుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.

కొంతకాలము గడచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని జూచి యెదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి సనకాది మునులాశ్చర్య పడి యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి?  వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతివాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యముకాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.

మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు, నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే, నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యుండని ప్రార్థించిరి.

నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంతచిత్తులై పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధరూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి యిహలోక సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయవివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.

Tuesday, February 26, 2013

మాఘ పురాణం - 18

18వ అధ్యాయము - ఇంద్రుని శాపవిముక్తి

శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును.మాఘ వ్రతము నాచరించినవారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.


మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేద అములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము, మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను.


దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కౌరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాతి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము ఇంకను వినవలెననున్నది ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలదు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతదు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయ్చు శిష్యులకు మాఘ్మాస మహత్త్యమును వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాదు నరకమునపోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచరూపముపోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.

Monday, February 25, 2013

మాఘ పురాణం - 17

17వ అధ్యాయము - ఇంద్రునికి కలిగిన శాపము

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వరు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.


పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి, ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి యాకాశ మార్గమున పోవుచున్న యింద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనించుచుండెను.


మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై యింద్రునిపొందు అంగీకరించెను, కోరిక తీరిన యింద్రుడు ఆశ్రమము నుంది వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై  స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటున్ విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.



ముని శాపమువలన యింద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి యెచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు యింద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు యింద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారికిట్లనిరి.

దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున నా/తటాకదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ, పురాణ పఠనము, యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘ్మాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి యదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము ఆవూప దానము, పాయసదానము, వస్త్రకంబళములదానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాలమున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.

స్వామీ: నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుదు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా యింద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతదు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.


దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే స్వ్స్థుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విస్వామిత్ర మహర్షియునింద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత యాశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు శక్తి యిష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో గలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీదించుచుందిరి. ఆ దృస్యమును చూచి మందిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు యింద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.

Sunday, February 24, 2013

మాఘ పురాణం - 16

16వ అధ్యాయము - విద్యాధరపుత్రిక కథ

రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ "నయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముంకౌ మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని  నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను, కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను. ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు, శివును తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని" చెప్పి యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.

అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి "సుందరీ! నన్ను వరించుమని యడిగెను, ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపుననిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా 'నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి 'అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.

నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.

విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాగమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును, ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.

హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి, సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతదు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతదు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను, వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి, అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.

Saturday, February 23, 2013

మాఘ పురాణం - 15

15వ అధ్యాయము - జ్ఞానశర్మకథ - మాఘపూర్ణిమ

గృత్నృమదుడుజహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమచరించితిని యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు 'స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితిని, నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.

అప్పుడు శ్రీహరి 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే యిప్పుడీ  గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.


ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివరికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.

బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుదును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుదు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విదిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.

Friday, February 22, 2013

మాఘ పురాణం - 14

14వ అధ్యాయము - విప్రుని పుత్రప్రాప్తి

గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడూగ జహ్నమహర్షి యిట్లనెను. జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతము నాచరించుటచే ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని యిట్లు పలికెను.

పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతిదయజ్ఞానము యింద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను". అప్పుడామె నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును, అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపముచేసి మృకండు మహామునివలె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.

బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు "విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్యప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే యెడుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.


విప్రకృత విష్ణుస్తుతి

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||
జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||
సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||
(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము)

జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్ ఆ విప్రుడు 'స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్రసంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు 

చెప్పిన యీ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి యంతరాథనము నుండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు తన యింటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానినినిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచారవదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. "నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను?" అని భర్తతో పలికెను.

ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరిణించిన తరువతనైన మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కనున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు తాని చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము అని యామనూరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము అని పలికి మరల గంగాతీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.

Thursday, February 21, 2013

మాఘ పురాణం - 13

13వ అధ్యాయము - సుశీలుని కథ


రాజా! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను, ఉన్నతములగు వృక్షములతోను, పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెడకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి యవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.

కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ! నీవెవరవు? నీకీ పరిస్థితియేమి? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను, ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన, దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.

సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే, వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.

సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని, కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక, పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నంది పుణ్యలోకముల నందుదురు. స్నానము యేడు విధములు. అవి,
  • మంత్రములను చదువుచు చేయు స్నానము, మంత్రస్నానము.
  • మట్టిని రాచుకొని చేయు స్నానము, మృత్తికాస్నానము.
  • భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము, ఆగ్నేయస్నానము.
  • గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము, వాయవ్యస్నానము.
  • నదులు, చెరువులు మున్నగువానిలో చేయు స్నానము, వరుణ స్నానము.
  • ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము, దివ్యస్నానము.
  • మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము, మానసస్నానము.

ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును, జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.

స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి, ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను, ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను, నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును, పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.

స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని, గంగను, దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.

Wednesday, February 20, 2013

మాఘ పురాణం - 12

12వ అధ్యాయము - శూద్రదంపతుల కథ


వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి యిష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను యింకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని యింటికి వచ్చెను. "అమ్మా నేను బాటసారిని అలసినవాడను, చలి, చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ యింట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని" యింట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద "ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై యిట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను, కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన యభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును వలదు అని యడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు యింటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.

అప్పుడామె విష్ణుదూతలారా! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని యడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి.అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా!  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా! బలవంతముగ చేసినను యిష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా యని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.

అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున, నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు యిష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి, యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని, యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.

మానవుడు తెలిసికాని, తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును, తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా, పురాణశ్రవణము, దానము యధాశక్తికిగ పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోణభద్ర, గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను, కూడ యింతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ, పురాణశ్రవణము, దానము వీనినన్నిటినిగాని, కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.

Tuesday, February 19, 2013

మాఘ పురాణం - 11

11వ అధ్యాయము - భీముని ఏకాదశివ్రతము

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేనిచోట తటాకమందుగాని, తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, యితరులకు పెట్టడు, ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా" అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్రనుండి లేచి చూడగా, అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి సానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు యేకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా! "ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా! భోనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి", అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును యేకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా ని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, యేకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము", అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి "రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు యిరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.

ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియేగాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైనదినమో, అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే 'శివరాత్రీ యని అందురు. అది యీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే 'మహాశివరాత్రి" అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికమైనది. ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేది. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక, అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట, జంతువులను చంపి, వానిని కాల్చి, తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట యివన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు-పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి, ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, "మహేశా! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా" అని యముడు విన్నవించుకున్నాడు. "యమధర్మరాజా! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న యీ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది" అని పరమేశ్వరుదు వివరించెను.

Monday, February 18, 2013

మాఘ పురాణం - 10

10వ అధ్యాయము - ఋక్షకయను బ్రాహ్మణ కన్యవృత్తాంతము 

పూర్వము భృగుమహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో యిల్లువిడిచి గంగానది తీరమునకుపోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుటవలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠమందేవుండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి "తిలోత్తమ" అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "ఓయీ! మీకేమి  కావలయునో కోరుకొనుము" అని అనగా, "స్వామీ మాకు యితరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే యిచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ యిద్దరు రాక్షసులును మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి, దేవతలందరినీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని "మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానాభీబత్సము జేతుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు" మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  "అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో చాల అల్లకల్లోలము చేయుమన్నారు. కాన, నీవుపోయి నీచాకచక్యముతో వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము" అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమునూ విని ఆ దానవసోదరులు అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి, నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా! మిమ్ములను పెండ్ళియాడుట నాకు యిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే నేను మీ యిద్దరియెడల సమాన ప్రేమతోనున్నాను. కాని యిద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ యిద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను  స్వంతముకాగలను అని చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడననగా నేను బలవంతునని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందున యిద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినందా తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి,"తిలోత్తమా! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"వని పంపెను.

Sunday, February 17, 2013

మాఘ పురాణం - 9

9వ అధ్యాయము - గంగాజల మహిమ

ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక, పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని, "గంగ గంగ గంగ" అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజ్లము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుదు వివరించెను.

కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విధ్యార్థియూ, మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాదించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది.

ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరింనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నసించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీదించుచుందిరి. ఆ దృస్యమును చూచి మందిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

Saturday, February 16, 2013

మాఘ పురాణం - 8

8వ అధ్యాయము - దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట

దత్తత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాదు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు, త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు 'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు, ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి "గురువర్యా! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.

"భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమనమైన నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక, యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు", అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. "పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుదు, బంగారునగలు, నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి, కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.

"అయ్యా! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును" అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు " ఓయీ వైశ్యపుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియ్తునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

Friday, February 15, 2013

మాఘ పురాణం - 7

7వ అధ్యాయము - లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము

వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి, "తల్లీ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెడను" అని బ్రతిమలాడెను.

తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి, అందొక తుంగచాపవేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ర్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, "ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి? సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది" అని అడుగగా నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, "అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను, పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవును రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ, వృద్దులూ, రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను" అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.

అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి "ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి, పూజలుచేసి, దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పదుకో", అని కోపంగా కసిరాడు.

ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.

కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.

"ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కనీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.

ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. "నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను?" అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టి పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా! వింటివా! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుననుటలో సందేహములేదు.

Thursday, February 14, 2013

మాఘ పురాణం - 6

6వ అధ్యాయము - కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ

మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆల్కింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది. 

ఒకనాడు నా భర్త "సఖీ! మాఘమాసము ప్రవేశించినది, యీనెల చాల పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి, కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర, పటిబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును" అని హితబోధ జేసెను.

నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి, అతనిని నీచముగా జూచితిని, నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి "ఓసీ మూర్ఖురాలా! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా, అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక" అని నన్ను శపించెను.

"అమ్మాయీ! భయపడకుము, నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని, అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.



ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము. స్త్రీలుకాని, పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందునూ, పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతొ మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును", అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.

Wednesday, February 13, 2013

మాఘ పురాణం - 5

5వ అధ్యాయము - కుక్కకు విముక్తి కా విలుగుట

దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -

"నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని" కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.

తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి

శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |
     అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||

అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు 

ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. "ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించెను.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.

ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, 'రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.

ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.


ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.

నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 
కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము 
కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి 
మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని 'అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము 
యేమి?' అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.