Friday, January 11, 2013

మకర సంక్రాంతి

సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే 'మకర సంక్రమణం' లేదా 'మకర సంక్రాంతి' అని పిలవడం జరుగుతోంది.మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తొలి రోజు భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి నుండి ఉత్తరాయన పుణ్య కాలం మొదలై ఆరు నెలల వరకు ఉంటుంది. ఇది దేవ కాలము, ఎంతో శుభదాయకమైనది.ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు.

మొదటి రోజు భోగి ఈ రోజు ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. భోగినాడు భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు అది ఏంటంటే ఇంట్లో ఉండే పనికి రాని పాత వస్తువులు వేస్తారు. కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు పోస్తారు అనగా రేగిపళ్ళు, పప్పులు,చెరుకుముక్కలు, మరియు కొన్ని నాణాలను కలిపి పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలలో నూగులు, పప్పులు, బెల్లం కలిపి పెట్టడం ఆనవాయితి.





  



రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో పొంగలి తయారు చేస్తారు. ఇంకా ఈ రోజున రకరకాల పిండి వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషముతొ ధాన్యము ఇస్తాము.






మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు.పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు. కనుమ రోజు 'మినుము' తినాలని 'గారెలు' చేసుకొని తింటారు.











No comments:

Post a Comment