Friday, January 29, 2010

కృష్ణాష్టమి


        ద్వాపర యుగములో రోహిణి నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు ఈ రోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటాము.ఈ రోజు వేకువతోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తులసీదళాలు వేసిన నీటితొ స్నానం చేయాలి.అలా చేస్తే సమస్త నదుల్లొ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.పగలు ఉపవాసం వుంటూ పూజా కార్యక్రమం జరుపవలెను. ఈ రోజు చిన్ని కృష్ణుని పాదాలు వేయడం అనవాయితి.అలా చేస్తే చిన్ని కృష్ణుడు వస్తాడని పూర్వం నుండి నమ్మకం. పూజ ముగిసిన తర్వత పాలతో  కాని, పెరుగుతో కాని, అటుకులతో  చేసిన నైవేద్యం పెట్టాలి.

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

నైవేద్యం : 

అటుకుల పాయసం:
కావలసినవి:
అటుకులు  -  పావు కేజీ,
పాలు     -  లీటరు,
చక్కెర - పావుకేజీ,
ఏలకుల పొడి - అర టీ స్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
కిస్‌మిస్   - పది
నెయ్యి   -  జీడిపప్పు, కిస్‌మిస్ వేయించడానికి తగినంత

తయారి:
ముందుగా పాలను సగానికి ఇంకే వరకు మరిగించాలి. ఈ లోపుగా అటుకులలో ఉండే సన్నని దుమ్ము, పొట్టు పోయేటట్లు నీటిలో వేసి పిండి అరబెట్టలి. పాలు కాగిన తర్వాత ఏలకుల పొడి, అటుకులు వేసి కలిపి దించేయాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.


Monday, January 25, 2010

శ్రీ హనుమజ్జయంతి


యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలీం|
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే ||
అంజనానందం వీరం జానకీ శోకనాశనం |
కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం ||

ఆంజనేయ స్వామి వారి జననం వైశాఖమాసం, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రంలో జరిగింది. అంజనాదేవి, కేసరీ దంపతులకు వాయుదేవుని వరప్రభావముచే ఆంజనేయుడు జన్మించాడు. శ్రీ అంజనేయ స్వామి వారి భక్తులకు ఇది ముఖ్యమైన పర్వదినము. దీనినే హనుమజ్జయంతి అని కూడా అంటాము. భక్తతులసిదాస్ కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికిని హిమాలయాలలో చిరంజీవిగా తపస్సు చేసుకొనుచున్నాడు. 'రామాయణంలోని అంజనేయుడు జీవించి వుంటాడా?' అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన చిరంజీవి అతులిత బలధాముడు మహాయోగి.

ఆంజనేయుడు పుట్టిన కొద్ది దినములలోనే సూర్యుని పండుగా భ్రమించి, మింగబోవగా ఇంద్రుడు వజ్రాయుధముతో అనువు(దవడ) మీద కొట్టగా స్పృహ కోల్పోగా వాయుదేవునికి కోపంవచ్చి ఆంజనేయుని తీసుకొని ఎవరికీ కానరాక దాగియుండెను. ఆ సమయంలో లోకములలో గాలి ఆడక జీవులన్నీ కటకటలాడిపోవగా, అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షమయ్యి ఆంజనేయుడు చిరంజీవి అనియు విశేష పరాక్రమశాలి అనియు వరములిచ్చి "హనుమ" అని పిలిచి వాయుదేవుని శాంతింపజేసిరి. అప్పటినుండి ఆంజనేయునుని హనుమంతుడు అని పిలిచారు.

హనుమంతుడు సూర్య భగవానుని వద్ద శిష్యునిగా చేరి చతుర్వేదాలు నేర్చుకున్నాడు. సుగ్రీవునికి మంత్రిగా ఉండి, రామ-సుగ్రీవులకు మైత్రిని నెలకొల్పాడు. సీతాన్వేషణకు కూడా ముఖ్య పాత్రధారి అయ్యాడు.

హనుమకు వాహనం 'ఒంటె'. హనుమకి సింధూరం అంటే ప్రీతి. ఒకనాడు సీతమ్మవారు నుదుటన సింధూరం ధరించగా హనుమ ఇలా అడిగాడంట అమ్మా నుదుటన సింధూరం ఎందుకు ధరించారు అని, అప్పుడు సీతమ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు నుదుటన సింధూరం ధరిస్తే నా పతికి మంచి జరుగుతుంది అని. వెంటనే హనుమ ఐతే నేను నా వళ్ళంతా సింధూరం పూసుకుంటాను అలా ఐతే నా స్వామికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అన్నాడు. అప్పటినుండి హనుమకు వళ్ళంతా సింధూరం పూస్తారు. స్వామికి తమలపాకులన్నా ప్రీతి ఎక్కువ.

ఆంజనేయ పూజితస్చేత్ పూజితా సర్వదేవతాః |
హనుమన్మహిమా శక్యో బ్రహ్మణాపిన వర్ణితుమ్ ||

భావం:
ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే. బ్రహ్మ దేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ.

పూజా విధానం :


(ఈ ద్వాదశ నామాలు అనునిత్యం త్రికాలములలో జపిస్తే శత్రుభయం అనేది ఉండదు)

హనుమంతుని పటం పూజా మందిరంలో పెట్టి షొడశోపచారములతొ పూజ చేయాలి. స్వామి వారికి మనకు తోచిన నైవెద్యం పెట్టి హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాలలోను ఎనలేని విజయం చేకూరుతుంది.

Saturday, January 16, 2010

శ్రీ నృసింహ జయంతి


నృసింహజయంతి అనగా నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యాక్షుని సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను. కనుక ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు జరుపుతారు. 

వైశాఖ శుద్ధ చతుర్దశినాడు శ్రీ నృసింహాస్వామి వారి జయంతి మనము జరుపుకుంటాము. స్వామి వారు వైశాఖ మాస శుక్ల పక్షంలొ పూర్ణిమ ముందు వచ్చే చతుర్దశినాడు ఉభయ సంధ్యలకు నడుమ అనగా సాయంకాల సంధ్యా కాలంలొ ఇటు పగలు అటు రాత్రి కానివేళ ఇటు నరుడు అటు జంతువు కాని రూపంతో అటు భూమి ఇటు ఆకాశం కాని తన తొడల పై హిరణ్యకశ్యపుని పొట్టను చీల్చి ప్రేగులు మెడలొ వేసుకొని ప్రళయ గర్జనలు చేస్తూ భూనభొంతరాళాలు దద్దరిల్లినట్టు గా సింహనాదం చేస్తూ మధ్యాహ్న సూర్యునివలె ఆవిర్భవించాడు శ్రీ నారసింహమూర్తి.

వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే |
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ||

ఈ రోజు బ్రహ్మముహూర్తంలొ లేచి తలస్నానమాచరించి శ్రీ స్వామివారిని కొబ్బరినీళ్ళతో, తేనెతో, ఆవుపాలతో, శ్రీ సూక్త, పురుష సూక్త సమన్వితంగ అభిషేకించి శ్రీ నారసింహ సహస్రనామ స్తొత్రం చేయాలి. స్వామివారికి వడపప్పు, పానకము నివేదన చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయాలి. ఈ విధంగా నృసింహ జయంతి జరుపుకోవాలి.

శ్రీ రామనవమి


శ్రీ రామచంద్రమూర్తి జన్మించిన రోజున మనము శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటున్నాము. అదే విధంగ సీతారాముల కళ్యాణం కూడా ఆరోజే. శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి దిగ్విజయంగ అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడ ఈరోజే. మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజున శ్రీ రామపట్టాభిషేకము జరిగినది. ఇది ప్రతి హిందువుకు మరువరాని సంతోషమైన రోజు. ఈ రోజున ధనశక్తికొలది ప్రతివారూ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహమును కానీ  శ్రీరామ పట్టాభిషేక పటమును కాని పెట్టి పూజించాలి.

పూజా విధానము :-
ఫూజా మందిరంలో  రాముని ప్రతిమను పెట్టి అలంకరించి షొడషోపచారములు చేసి పానకము, వడప్పప్పు, మజ్జిగ నైవేద్యమిచ్చి కర్పూర హారతినీయవలెను. తర్వాత ఒక బ్రాహ్మణుడిని శ్రీ రాముడిగ భావించి విసనకర్ర, పానకం, వడప్పప్పు, మజ్జిగ ఇచ్చి అతని అశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకొనవలెను.

నైవేద్యం:

వడపప్పు :-
పెసరపప్పుని నీటిలొ నానబెట్టి పెసరపప్పు బాగా నానాక నీటిని వంపేయాలి.


పానకం :-
నీటిలో బెల్లం వేసి కలపాలి. దానికి యాలుకల పొడి చేర్చాలి.


మజ్జిగ :-
పెరుగును చిలికి ఉప్పు వేసి కరివేపాకు,కొత్తిమీరతొ తిరువాత వేయాలి.


ఉగాది

          మనకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు  ఉగాది పండుగ వస్తుంది. ఈ పండుగ రోజున మనము చేయవలసిన విధులు. ఉదయం 5:30 గంటలలొపు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. తిలకం ధరించి,నూతన వస్త్రములను ధరించాలి. తరువాత సూర్యభగవానునికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, అర్ఘ్యము, దీపం, ధూపం సమర్పించి ఆ తర్వాత "వేపపూత పచ్చడి" విధిగా తినాలి.

వేపపూత పచ్చడి:

కావలసినవి:

  1. వేపపూత 
  2. కొత్త బెల్లం
  3. కొత్త చింతపండు పులుసు
  4. మామిడికాయ తురుము
  5. పప్పుల పొడి
  6. కారం
  7. ఉప్పు


పైవన్ని కలిపి దేవుడికి నివేదించి ప్రసాదంగా మనం తీసుకొవాలి.



పంచాంగ శ్రవణం :-

ఉగాది రోజు మనం పంచాంగ శ్రవణం వినుట వలన, తిథి వలన సంపదయునూ, వారము వలన ఆయుష్యమును, నక్షత్రము వలన పాప పరిహరమును,యోగము వలన వ్యాధిని వృత్తియునూ,కరణము వలన కార్యానుకూలమున్నూ కల్గును. ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారము, గోవులు, ధాన్యము, కన్యను దానము చేస్తే కల్గినంత ఫలితం కల్గుతుంది. అంతేకాక రాజాధి నవ నాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రొక్తంగా వినుట వల్ల గ్రహదోషములు,నివారణ అయ్యి ,వినువారికి ఆరొగ్యమూ,ఆయుష్యును,సంపదల యందు శుభఫలితాలు కల్గును.


Friday, January 15, 2010

మన పండుగలు

పండుగల ప్రాముఖ్యత

ఈనాడు మనం జరుపుకునే పండుగలు శ్రీమహాభారత కర్తైన శ్రీ వేదవ్యాసుమహర్షి వేదాలనువిభజించి పురణాలను రచించి యావత్ మానవాలికి ఈ పర్వదినాలు ప్రసాధించాడు.మనం జరుపుకునే పెళ్ళి,వడుగు,బారసాల మొదలగు పుణ్య కార్యాలకు కావలసిన విధులు తెలియజేశారు. హిందు పండుగలన్నిటికి నిత్యం సంధ్య వార్చుకోవాలన్న ముందుగా మనకు 'హిందూకాలమనం' తెలియాలి. ప్రతి  శుభకార్యమునకు 'సంకల్పం' లేకుండ మంత్రకాండ జరగదు. కనుక హిందువులమైన మనం హిందూకాలెండర్ తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మనకు ఏ పండుగ తర్వత ఏ పండుగ వస్తుందో, ఏమాసం తర్వాత ఏమాసం వస్తుందో  మనకు తప్పక తెలుస్తుంది.

ఇపుడు జరుగుతున్న కలియుగం యొక్క ' ఆది ' అంటే సంవత్సరం ప్రారంభకాలము (కలియుగ ప్రారంభ కాలము) ' ప్రమాది ' నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఏర్పడిన గ్రహాల కూటమితో ప్రారంభమైనది. (ఇది సుమారు 5094 సంవత్సరముల క్రితం వచ్చినది) ఆరోజు శుక్రవారం, సూర్యగ్రహణం, అమావాస్య, అర్ధ్రరాత్రి అష్టగ్రహకూటమి  అన్నీ కలిసి మేషరాశి ప్రారంభ బిందువులొ కలిసిన కలమే  మన పంచాంగాలకు మూలం. ఆనాడే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది. అదియే హిందూ క్యాలెండర్ కు మూలస్థంభం. ఆ రోజే సంవత్సరాది ప్రారంభం. ఆ చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం ప్రారంభమైన ' ఉగాది 'గా మారింది.