30వ అధ్యాయము - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి
నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.
అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.
కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.
కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.
సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.
కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.
No comments:
Post a Comment