మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది||1||
సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు ||2||
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణి ద్వీపానికి మహానిధులు ||3||
పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాధుల గాన స్వరాలు
మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||4||
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవునగలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు ||5||
అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ||6||
అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ
మణిద్వీపానికి మహానిదులు ||7||
కోటి సూర్యులు ప్రపంచ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిదులు
||భువనేశ్వరీ|| ||8||
కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు ||9||
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ||10||
ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ||11||
సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||12||
మిలమిలలాడే ముత్యపురాసులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ||13||
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ||14||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ భూతములు పంచ శక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ||15||
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||16||
మంత్రిణి దండిని శక్తి సేవలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||17||
సువర్ణ రజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు ||18||
సప్త సముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ||19||
మానవ మాధవ దేవ గణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలాయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||20||
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||21||
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||22||
శ్రీ విఘ్నేస్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ||23||
పంచ భూతములు యజమాన్యాలు
వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||24||
చింతామణులు నవరాత్రులు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ||25||
దఃఖము తెలియని దేవీ సేవలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు ||26||
పదునాల్గు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం ||27||
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములొ
||భువనేశ్వరీ|| ||28||
మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములొ ||29||
పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2 సార్లు|| ||30||
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు ||2 సార్లు|| ||31||
శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన ఛదివినచోట
టిష్ట వేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||2 సార్లు|| ||32||
ఫలశృతి:
పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.
No comments:
Post a Comment