Thursday, August 8, 2013

మంగళగౌరీ వ్రతము

పూజా ద్రవ్యాలు:
పసుపు
కుంకుమ
పండ్లు
పూలు
తమలపాకులు
వక్కలు
అగరబత్తులు
కర్పూరం
గంధం
అక్షతలు
కొబ్బరికాయ
వస్త్రము(పత్తితో చేయునది)
నేతి దీపము
నూనె
కత్తి
నైవేద్యం : పిండి వంటలు

పసుపుతో రెండు కొమ్ములతో గౌరి దేవిని ఒక కొమ్ముతో వినాకుడుడిని చెసి తమలపాకుల మీద ఉంచి తాంబూలం పెట్టాలి.

దారం 5 వరసలు తీసుకుని 5 గ్రంధులతో 5 తోరాలు తయారు చేసుకోవాలి.
1 అమ్మవారికి రెండోది పూజచేయువారికి ం
ఊడోది తమలపాకు తో కత్తికి కట్టటానికి మిగిలినవి వాయనం ఇచ్చె ముత్తైదువులకు.

వ్రత నియమం:
ఈ వ్రతం కొత్తగా పెళ్ళైన వారు ఐదు సంవత్సరములు శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు చేయాలి. ఐదుసంవత్సరాలు అయ్యాక కొత్తగా పేళ్ళైన అమ్మాయికి ఇవ్వాలి.


మొదటి సంవత్సరములో వచ్చే తొలి మంగళవారము పుట్టింట్లో చేసుకోవాలి.

పూజ విధానము:
ఆచమనం:  (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
    ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము :
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి

సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, ....పక్షే , ....తిధౌ, మంగళవాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, మమ యావజ్జీవ సౌమంగల్య సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలసిద్ధ్యర్థం సర్వమంగళాగౌరీ దేవతా ముద్దిశ్య మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం మంగళగౌరీ వ్రత మహం కరిష్యే అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
అని మూడుమార్లు నీటిని ఆకులోగాని, పళ్ళెములోగాని వదలవలయును. ఆ పిదప గంటను ఈ శ్లోకము చదువుచు వాయించవలయును.

శ్లో|| ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం |
దేవతాపూజనార్థాయ ఘంటానాదం కరోమ్యహం ||
అని ఘంటవాయించి కలశమునకు మూదువైపుల గంధము పెట్టి, కుంకుమ పెట్టి కలశం నీటిలో అక్షతలు, గంధము, పుష్పము ఉంచి చేతితో మూసి ఈ క్రింది శ్లోకములతో అభిమంత్రణ చేయవలయును.

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గ్లాసులో నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోని కింది శ్లోకాన్ని చెప్పుకోవాలి

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||

మాతః సర్వ జగన్నాధే యావత్పూజావసానకం |
తావత్త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు ||
అవాహితాభవ స్థాపితా భవ సుప్రసన్నభవ వరదాభవ మమ ఇష్టకామ్యార్థ సిద్దిదా భవ

అత్రాగచ్చ మహాదేవి సర్వలోక సుఖప్రదే |
యావద్ర్వత మహంకుర్వే పుత్త్ర పౌత్రాభి వృద్ధయే ||
సర్వమంగళాయై నమః ఆవాహయామి

బాలాంనవోఢాం సంపూజ్యాం మంగళద్రవ్య వాసినీం |
సర్వాలంకార సంపూర్ణాం భావయే త్సర్వమంగళాం ||
మంగళగౌర్యై నమః ధ్యానం సమర్పయామి

రౌప్యేణ చాసనం దివ్య రత్న మాణిక్య శోభితం |
మయానీతం గ్ర్హాణ త్వం గౌరి కామారి వల్లభే ||
ఆసనం సమర్పయామి

గంధపుష్పాక్షతైర్యుక్తం పాద్యం సంపాదితం మయా |
త్వంగృహాణ దయాసింధో గౌరి మంగళ దేవతే ||
పాదయః పాద్యం సమర్పయామి

సర్వలోక ప్రియేదేవి శంకరప్రియభామిని |
గృహాణార్ఘ్యం మయాదత్తం సౌభాగ్యం దేహి సర్వదా ||
అర్ఘ్యం సమర్పయామి

కామారి వల్లభేదేవి  కుర్వాచమనమంబికే |
నిరంతర మహం వందే చరణౌ తవపార్వతి ||
ఆచమనీయం సమర్పయామి

పయోదధిఘృతం చైవ మధుశర్కరయా సమం |
పంచామృతేన స్నపనం కారయే త్వాం శివప్రియే ||
పంచామృతైః స్నపయామి

గంగాజలం సమానీతం శుభం కర్పూర సంయుతం |
స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్త్రాది ఫలప్రదాం ||
శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రంచ సోమ దైవత్యం లజ్జాయాస్తు నివారణం |
మయా సమర్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి ||
వస్త్రయుగ్మం సమర్పయామి

కుంకుమాగరు కర్పూర కస్తూరీ చందనాదికం |
విలేపనం మహాదేవి గంధం స్వీకురు శాంకరి ||
గంధం ధారయామి

రంజితాం కుంకుమౌఘేన హరిద్రాక్తా స్తథాక్షతాః |
తవతలంకరణార్థాయ ప్రదత్తా స్సర్వ మంగళే ||
అక్షతాన్ సమర్పయామి

హరిద్రాం కుంకుమంచైవ సింధూరం కజ్జలాన్వితం |
నీలలోహిత తాటంకే మంగళద్రవ్య మీశ్వరి ||
హరిద్రాకుంకుమాది సౌభాగ్య ద్రవ్యాణి సమర్పయామి

చంపకాకుంద మందార పున్నాగ బృహతీయుతైః |
పుష్పైర్బిల్వదళోపేతైః పూజయామి సివప్రియే ||

అథాంగ పూజ:
ఉమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జంఘే పూజయామి
పార్వత్యై నమః జానునీ పూజయామి
జగన్మాత్రే నమః ఊరూ పూజయామి
జగత్ర్పతిష్ఠాయై నమః కటిం పూజయామి
మూల ప్రకృతయే నమః నాభిం పూజయామి
అంబికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి
శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
బ్రహ్మవిద్యాయై నమః జిహ్వాం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రౌ పూజయామి
రుద్రాయై నమః కర్ణౌ పూజయామి
సర్వ మంగళాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
మంగళగౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ లలితాష్టోత్తర శతనామావళి(ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

సర్వమంగళా మంగళ గౌర్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పైః పూజయామి

దేవదారు రసోద్భూతః కృష్ణాగరు సమన్వితః |
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ||
ధూపమాఘ్రాపయామి

త్వంజ్యోతి స్సర్వదేవానాం తేజసాం తేజ ఉత్తమం |
జ్యోతిర్మండలగే దేవి దీపం స్వీకురు శాంకరి ||
దీపం దర్శయామి

అన్నం చతుర్విధంస్వాదుర సైష్షడ్భి స్స్మన్వితం |
గృహాణ భక్ష్య భోజ్యాఢ్యం సుమృష్ణం సర్వమంగళే ||
నైవేద్యం సమర్పయామి

వూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళాన్వితం |
కర్పూరైలా సుధాయుక్తం తాంబూలం శివసుందరి ||
తాంబూలం స్మర్పయామి

సౌవర్ణీ దక్షిణా ప్రోక్తా పూజా సాఫల్య కారణం |
దక్షిణాం ప్రతిహృహ్ణీష్వ దక్షిణే సర్వమంగళే ||
దక్షిణాం సమర్పయామి

వాణీ లక్ష్మీ శచీ మౌళీ నీరాజిత పదాం బుజే |
శివే నీరాజయామి త్వాం నిత్య లోక ప్రకాశికాం ||
కర్పూర నీరాజనం దర్శయామి

శివాంక వాసినీ మంబాం సర్వే దేవా మహర్షయః |
ప్రదక్షిణేన పశ్యంతి తేన కుర్యాం ప్రదక్షిణం ||
ఇం నమశ్శివకాంతాయై హ్రీం నమశ్శివశక్తయే |
శ్రీంనమో జగతాం మాత్రే మమ భూయాన్మనోరథః ||
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

పుత్రాం దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళే |
సౌమంగల్యం సుఖం జ్ఞానం దేహిమే శివసుందరి ||
ఛత్ర చామరాందోలనాది సర్వోపచార పూజా పరికల్పయామి

అనేన మంగళగౌరీ వ్రతేన సర్వమంగళ మంగళగౌరీ సుప్రీత సుప్రసన్న వరదా భవతు
బ్రాహ్మణునికి, ముత్తైదువకు, తల్లికి వాయనం ఇవ్వవలెను
అన్ని శ్రావణమాసంలో మంగళవారాలు ఐదు పోగులు, ఐదు ముడులు ఉన్న తొరమును పూజలో పెట్టి పూజైన తరువాత ధరించవలెను. బియ్యంపిండి, బెల్లం కలిపి ప్రమిదలు ఐదు చేసి జ్యోతులు వెలిగించి తమలపాకు కట్టిన చాకుతో దీపాన్ని తాకుతూ కథ చదవాలి. కథ ముగిన తరువాత చాకుపై ఉన్న కాటికను ముత్తైదువులకు ఇచ్చి వ్రతం చేసిన వారు ధరించాలి.

మంగళగౌరీ వ్రత కథ:

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణామూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.

ఒకప్పుడు సూత మహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవి కుపదేశించిన మంగళగౌరీ వ్రత కథయు, పూజావిధానమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. పసువు, కుంకుమ, పూలు, సగుంధాది మంగళద్రవ్యాలలోను, ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ మంగళగౌరీ కొలువై ఉంటుంది.

త్రిపురాసురుని చంపటానికి వెళ్ళే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన 'మండూడనే రాజు గౌరీ దేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకములో సర్వసంపదలతో రాజూమేలాడు. అటువంటి గౌరీ దేవిని పూజించి, వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను.

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము.

చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి "భవతీ భిక్షాందేహి" అన్నాడు. జయపాలుని భార్య బంగారు పళ్ళెంలో అన్నీ సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది, జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భార్యతో చెప్పాడా రాజు.

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక మీకు సంతానము లేని కారణంగా నీచేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య, "అయితే మహాత్మా! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి" అని వేడుకోగా ఆ సన్యాసి రూపములో ఉన్న ఈశ్వరుడు "అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీ కోరిక నెరవేరుతుంది.

"నీ భర్తను నీల వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను, ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణదేవాలయం లో ఉండే అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు. స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు. జయపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు సాక్షాత్కరించి ఎం కావాలో కోరుకోమంటే తనకు సంతానం కావలెనని కోరాడు. అప్పుడు అమ్మవారు "వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని" అడిగింది. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి తన పక్కన ఉన్న గణపతి దగ్గరనున్న మామిదిచెట్టు మీది ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసాడు. కాని అన్ని మాయమయి ఒక్కటే మిగిలినది. గణపతికి అలాకోసేసరికి కోపము వచ్చి ఈ చర్య వల్ల నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపించాడు.

ఈ వింధంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. అతనికి శివుడని నామకరణము చేసిరి. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్తతో అన్నది. కాశీవిశ్వేశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్ఠానపురం చేరారు.

అక్కడ కొందరు కన్యలు పూలుకోసుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను "ముండ,రండ" అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల "మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది" కాబట్టి మా కుటుంబములో ఎవరూ ముండలు, రండలు  ఉండరు అంది కోపంతో అంత వరకూ కోసిన పూలను నేల మీదికి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్లమీదికి చేరిపోయాయి.

జయపాలుడు కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. "మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళగౌరీవ్రతం చేస్తుంటుంది" అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోచింది. సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా సుశీల తల్లిదండ్రుల దగ్గరకి వెళ్ళి నీకూతురుకి తగిన భర్త అని శివుని చూపగా వారు ఆ పరమశివుడే శివుని పంపాడని వారిరువురికి వివాహం జరిపిస్తారు. వారి పెళ్ళిలో సుశీల తల్లి తన కూతురికి మంగళగౌరీ నోము ఉద్యాపన చేస్తుంది.

పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి "నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో ఆతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెపుతాను విను అని ఈవిధంగా చెప్పెను, "కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది" అని అంతర్ధానమయ్యెను.

శుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం, తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా నున్న కుండని తీసింది. సుశీల గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్దికోసం బయలుదేరారన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు, భార్యకు ఏ వివరం చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఖిన్నురాలై అతని చేతినుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది.

ఉంగరం వదలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగ అతనికి అతిధిమర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిధులకు రోజూ కాళ్ళు కడుగుతుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి, తను చనిపోతునట్లూ అప్పుడు మంగళగౌరియు, యమదూతలు తన విషయంలో వాదించుకుంటునట్లూ కల వచ్చింది. వళ్ళు మరలా ప్రతిష్ఠానపురం కొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు.

సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి, అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవక్ర్పవల్ల ఆ కాళ్ళపారాణి ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనబడింది. శివుడు కూడా తను ఎందుకిలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు.

పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకొని, భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది శుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లితండ్రులు అంధులై పోయారు. శుశీల మంగళ గౌరీ నోములో నోచిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు.ఇందన్నడు  అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుషు ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు.

దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుదు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయిష్షు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్య చేసిన పుణ్య కార్యాల వల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతోంది.

ఓ ద్రౌపదీ! మంగళ గౌరీ వ్రత ప్రసాదముతో వైధవ్యం లేకుందా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

గౌరమ్మ పాట:

కోటలేడు చుట్లు కొమరప్ప పట్నాన, మేటైన ఈ ఊరి మేడలిండ్లు
వాడవనితలెల్ల వచ్చి మిమ్ము కొలిచెదరు, వేడుకతో ఈశ్వర్ల గౌరమ్మను ||
|| జయ మంగళం నిత్య శుభ మంగళం ||
వాటమీగ పాదాలు వన్నెలొత్తగా పట్టి, పాటించి మెడిమలకు పసుపు పూసి
పొందుగా మాఇంటి పగిడి గద్దెమీద, ప్రత్యక్షమాయనే భాగ్య గౌరీ ||జయ||
ఏ ఇల్లు మంచిదో ఏ వాడ మంచిదో, ఏ నగరు మంచిదో అనుచు వచ్చి
నాన్యమైయున్నది నాకు ఈ నగరం అనుచు నట్టింట వెలసెనే ఆది గౌరి ||జయ||
కూటమూ న్నాలుగు మూలలా మహాలక్ష్మి, నవ్వుచు నాటకపు శాలలోను
ఆటకూటములున్న నాటకపు శాఅలలోన, నగరపుటిండ్లలో వెలిసెనే భాగ్యగౌరు ||జయ||
చీకటివనములో శ్రీమహాలక్ష్మివో మామిడివనములో మహాలక్ష్మివో
వసంతలక్ష్మివో వనజాయతాక్షివో శ్రీక్రిష్ణపట్నాన శ్రీమహాలక్ష్మివో ||జయ||
నిర్మలాలాక్షితో నీడలోలక్ష్మివో పొన్నలోఉండే నిజలక్ష్మివో
కాంతమున ఈ ఊరి ఘనపాటలక్ష్మివో ఘనల అన్నల ఘనల లక్ష్మివో ||జయ||
పచ్చ పసుపొక కాంతి బంగారమొక కాంతి అచ్చమాణిక్యాల ఆరకాంతి
దవళాయ నాసిక బరణమొక్కటికాంతి ఈశ్వర్ల గౌరమ్మ తానే కాంతి ||జయ||
చెట్టుచెట్టుకు పోయి చేమంతులు కోసి సృష్టికర్త అయిన శ్రీగౌరీ దేవి
శంభుడు ఈశ్వరుడు శాంబవతీ గౌరమ్మ చెండ్లాడుతూ వచ్చి చేరి నిలిచిరి ||జయ||
అవతల కావేరి ఇవతల కొల్లాడం నడుమనే శ్రీరంగనాథపురం
నాధుడు రంగనాయకుల పాలి అర్థాంగివై నాంచారికొసగితివే భాగ్యగౌరి ||జయ||
తెల్లచీరా కట్టి తెల్ల రవికా తొడిగి తెల్ల నాకుల కట్ట చేతబట్టి
తేజముగ మనకిపుడు సంపదిస్తామంటూ తెల్లవారింటికి వచ్చె గౌరు ||జయ||
కావి చీరా కట్టి కావి రవికా తొడిగి కన్నులకు సన్నంపు కాటుకీడి
కాంతరో మనకిప్పుడు సంపదిస్తామంటూ నడువెండలుండంగా వచ్చె గౌరు ||జయ||
పచ్చ చీరా కట్టి పచ్చ రవికా తొడిగి పచ్చనాకుల కట్ట చేతబట్టి
పడతిరో మనకిప్పుడు సంపదిస్తామంటూ పట్టపగలింటికి వచ్చె గౌరు ||జయ||
నీలి చీర కట్టి నీలి రవికా తొడిగి నిలువెల్ల బంగారు కొమ్ము పెట్టి
నెలతరో మనకిప్పుడు సంపదిస్తామంటూ నీరెండ నుండంగా వచ్చె గౌరు ||జయ||
నిత్య శుక్రవారమ్మ మన ఇంటిలో విందు అటుమీద శ్రీ వెంకటాద్రి విందు
గౌరీ పుత్రుల విందు గణనాయకుల విందు గౌరమ్మ మన ఇంట నిత్య విందు ||జయ||
అత్తలకు కోడళ్ళకు కావొదినా మరదళ్ళకు హెచ్చైన యారాండ్లకు పొత్తు
మాడుందురట పోరాటము లేక నిత్య మహలక్ష్మి నీవున్న చోట ||జయ||
నీవున్న చోట నీతుడై హరి ఉండు హరి ఉన్న చోటనే ధర్మముండు
ధర్మమున్న చోట జయము కలిగి ఉండు జయమున్న చోటనే సకలముండు ||జయ||
మహారాజ రామన్న మంత్రి లక్ష్మన్న తమ్ముదు భరతన్న శత్రుఘ్నులకును 
దయగల సీతకు దేవి ఊర్మిళకును చెల్లెలు మాండవతికి శ్రుతకీర్తికి ||జయ||
బొక్కసపు పెట్టెలకు భువనేశ్వరమ్ములకు బొమ్మల పల్లకులకు
ఆయుధములకు పెక్కు నవరత్నాల పెట్టెలకు కడపల కస్తూరి జువ్వాది కలశములకు ||జయ||
చుక్క బొట్టు కాటుక ఉల్లిపూసల దండ ఎక్కువైన వజ ఉల్లిపేర
జక్కినీల చేత ముక్కించుకొన్నట్టి చక్కని తల్లులకు పేరాండ్రాండ్రు
లకు ||జయ||
కొడుకులు కోడళ్ళు కుమార్తే అల్లుళ్ళు తగు మనుమలు మనుమరాళ్ళు
ఇంత ఒప్పటి వరము మా అత్త మామలకు ఇష్ట సంపదలిచ్చే గౌరు ||జయ||
నట్టింట అద్దము నాగ బందనపు తీగ పరుపు మీద పది నెలలు పాపడాడు
ఇంత ఒప్పటి వరము అక్క బావగార్లకు ఇష్టసంపదలిచ్చె గౌరు ||జయ||
ఆచంకనొక బిడ్డ ఈచంకనొక బిడ్డ కడుపులో ఒక బిడ్డ కదలాడగా
ఇంత ఒప్పటి వరము మా అన్నావదినలకు ఇష్టసంపదలు వరమిచ్చె గౌరు ||జయ||
శివునిపూజించినాడు శివుని ప్రార్థించినాడు శివుని మీదనే భక్తి నుంచినాడు పండ్రెండు రుద్రాభిషేకములు చెసినాడు పరమాత్ముని వంటి మా నాయనకు ఇష్టసంపదలు వరమిచ్చె గౌరు ||జయ||
అన్నదానము చేసి వస్త్రదానము చేసి ఆ మగనికి ఆ స్త్రీ అనుకూలము 
నిత్య గౌరీ పూజ తప్పకుండ చేయు సత్యవంతురాలు మా అమ్మకు ||జయ||
చిట్టి చిట్టి బొమ్మలు శ్రీ తొరణంబులు చిన్ని మా అమ్మాయి పెండ్లెన్నడు
మాఘమాసము నాదు మంచి ముహూర్తము నాడు పసిడి పంచమి నాడు పడతి పెండ్లి ||జయ||
పప్పునూ పెట్టరే పాయసం పెట్టరే అప్పచ్చులు వేయరే నెయ్యి వెయ్యరే
ఎప్పుడూ పెట్టరే ఏక చిత్తమున పాయక మా బాబుకు పాలు బువ్వ ||జయ||
శాంకరీ జగదాంబ జయ నిత్య కళ్యాణి పంకజాసన ముఖీ పావనాంగీ
కాంత శిరోమనికి కనక కుసుమములతో మంత్ర పుష్పములు పెడుతూ మహాలక్ష్మికి ||జయ||
ముత్యాల హారతి పగడాల హారతి మాణిక్యాల హారతి మగువ నీకు
ముత్తైదుతనమిచ్చె ముదముతో రక్షించు ఎత్తుకొమ్మని శిరస్సును ఎత్తుకొనిరి ||జయ||
పచ్చలా హారతి పగడాల హారతి మాణిక్యాల హారతి మగువ నీకు
అనంత కాలమ్ము ఐదవతనమిచ్చి దీపాల పల్లెరాలు దించుకొనిరి దించుకోంగా చూచి దృష్టాంతమాయనే భాగ్యలక్ష్మి ||జయ||
పూజింప మావంతు పూజగొన మీవంతు రాజసము మీవంతు రాజనావళి
అష్టైశ్వర్యములు అడిగేది మావంతు ఐదవతనమిచ్చేది మీ వంతు ||జయ||

వ్రత ఉద్యాపన:


ఈ వ్రతం పెళ్ళైన సంవత్సరం ప్రారంభించి ఐదు సంవత్సరములు చేయాలి. ఐదవ సంవత్సరం ఆఖరి శ్రావణ మంగళవారం మంగళగౌరిని యధావిధిగా పూజించాలి తరువాత ఒక పెళ్ళిలో పెళ్ళికూతురికి కొత్త వస్త్రాలు ఇచ్చి మెట్టెలు, మంగళసూత్రం కలిపి వాయనం ఇవ్వాలి. ఆ విధంగా మంగళగౌరీ ఉద్యాపన పూర్తి చేయాలి.

No comments:

Post a Comment