Friday, May 31, 2013

వైశాఖ పురాణం - 25

25వ అధ్యాయము - భాగవత ధర్మములు

నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను.

స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను.

అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకులోబడి మరల కర్మలను గుణానుకూలముగ చేయు తగిన ఫలితములనందుచున్నారు. మాయకులోబడి వారి గుణకర్మల వలని మార్పులుచేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖముల ననుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మమొదలుకొని పిశాచ జన్మాంతముగ తామసమార్గమునే చేరుచుందురు.

రాజసప్రవృత్తులు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము నధికముగ చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున నీరు నిశ్చయజ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.

సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణవిశిష్టులై శ్రద్ద కలిగినవారై యితరులను జూచి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తి నాశ్రయించియుందురు. వీరు తేజశ్శాలురై గుణత్రయశక్తిని దాటి నిర్మలులై యుత్తమ లోకములనందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్నకర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు నగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలననుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు.

సంపూర్ణకాముకుడైన శ్రీహరికి భేదబుద్ది దయ స్వభావము లేవు. సృష్టిస్థితి లయములను సమముగనే జీవులగుణకర్మల ననుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరును తాము చేసిన గుణకర్మల ననుసరించియే తగిన ఫలములను, శుభములను - అశుభములను, సుఖమును - దుఃఖమును, మంచిని - చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగ యెత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచటనాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును. పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింప వలసిన విషయమొకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో నతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో నతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కాని మనము ముండ్ల చెట్లమా, పండ్ల చెట్లమా యన్నది మన కర్మలను, గుణములను అనుసరించి యుండును. తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కాని ఆ చెట్ల తీరు వేరుగానుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా! అని శంఖుడు వివరించెను.

కిరాతుడు స్వామీ! సంపూర్ణజ్ఞానసంపద కలవారికి సృష్టిస్థితిలయములలో నెప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని యడిగెను. శంఖుడిట్లనెను. నాలుగువేల యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు నాలుగువేల యుగములకాలమే. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి పదునైదు దినములోక పక్షము. ఇట్టి రెండు పక్షములోక మాసము. రెండు మాసములొక ఋతువు. మూడు ఋతువులొక ఆయనము. రెండు ఆయనములోక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేదవిదులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవప్రళయము బ్రహ్మమానమున నొకదినము గడువగా వచ్చిన ప్రళయము. దినప్రళయము. బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడచినదో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు పదునాలుగు గడచినచో దీనిని దైనందిన ప్రళయమని యందురు.

మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావరజంగమములన్నియు లోకములతో బాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును.

తత్త్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతోబాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యధాప్రకారముగ జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మసృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను శ్రీహరి యవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మ కల్పము ముగియు వరకునుందురు. ఆయా రాశులయందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేదధర్మములననుసరించు నాయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు.

కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచగణముల యందున్నవారు తమ కర్మలననుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు.

బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తి కాలమును వినుము. శ్రీమహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరల కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగినవారు, లింగశరీరులు లింగశరీర భంగమైనవారునగు జీవులనేకులుందురు.

శ్రీమహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగ నున్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు లింగభంగశరీరులు పిపీలికాదిమానవాంత జీవులు, ముక్తినందినవారు, బ్రహ్మ మొదలు మానవులవరకు నుండు జీవులు వీరందరునుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యము నిచ్చును. కొందరికి తత్త్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారివారికి తగినట్లుగ అనిరుద్ద వ్యూహముననుసరించి వారి వారికి యిచ్చును. ప్రద్యుమ్న వ్యూహముననుసరించి సృష్టి చేయగోరును. మాయజయకృతిశాంతియను నాలుగు శక్తులను, వాసుదేవ అనిరుద్ద ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహములనుండి వరించెను. ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీమహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను.

యోగమాయను నాశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి యగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదుల కైనను యెరుగరావు అని శంఖుడు వివరించెను.

అప్పుడు కిరాతుడు స్వామీ! శ్రీమహావిష్ణువున కిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను. దయయుంచి చెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. చిత్తశుద్దిని కలిగించి సజ్జనులకుపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శ్రుతిప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్దము కానిదియగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణములచేత, బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్యనైమిత్తిక కామ్యములని మూడు రీతులుగ విభక్తములైనవి. నాలుగు వర్ణములవారును తమ తమ ధర్మములనాచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచోనవి సాత్విక ధర్మములని యందును. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములనియనిరి.


శ్రీమహావిష్ణువును విడిచి మరియొక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువు నందును, నాలుక శ్రీహరి నామోచ్ఛారణయందును హృదయము విష్ణుపాదముల యందును సక్తములై యుండునో వారే భాగవతులు. సదాచారములయందాసక్తి కలిగి అందరికి నుపకారమును చేయుచు, మమకారము లేనివారు భాగవతులు. వీనియందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగాగలవి రాజసధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు సత్త్వగుణము కలవారు. విష్ణుప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగజేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు భక్తులు.

వేదశాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతికరములైన ధర్మముల నాచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తిలేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నియు జ్ఞానులకుపయోగింపవు. చంద్రుని జూచి చంద్రకాంత శిలద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును.

ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుటవలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్దతో కూడి విష్ణుప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముగ వెన్నను స్వీకరించునట్లు అన్ని ధర్మముల సారము వైశాఖధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున నున్నప్పుడు చెప్పెను.

బాటసారులకు మార్గమున నీడ నిచ్చునట్టి మండపములను, చలివేంద్రముల నేర్పరుచుట విసనకఱ్ఱలతో విసరుట మరియు నుపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము, దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట తాంబూల దానము. ఆవుపాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగువానిని నిచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట యివన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చేరకుగడ నిచ్చుట, దోసపండ్ల నిచ్చుట పండ్లరసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట యివి వైశాఖధర్మములు అన్ని ధర్మములలోనుత్తమములు. ప్రాతఃకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదుల నాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానముల చేయవలెను. వైశాఖము తలంటిపోసుకొనరాదు. కంచుపాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగువానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వులపిండి పులికడుగు, చద్దియన్నము, నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడినవానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును. తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహములేదు.


ఈ విధముగ శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖమాసమంతయు వ్రతము నాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకీయవలెను. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించెను.


శ్లో|| వైశాఖేసితద్వాదశ్యాం దద్యాద్దద్ధ్యన్నమంజసా |
సోదకుంభంసతాంబూలం సఫలంచసదక్షిణం |
దదామి ధర్మరాజాయ తేవప్రీణాతువైయమః ||

పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు.


శ్లో|| శీతలోదకదధ్యన్నం కాంస్యపాత్రస్థముత్తమం |
సదక్షిణంసతాంబూలం సభక్ష్యంచ ఫలాన్వితం ||
తదామివిష్ణవేతుభ్యం విష్ణులోక జిగిషయా |
ఇతిదత్వాయధాశక్త్యాగాంచదద్యాత్కుటుంబినే ||

చల్లని యుదకమును పెరుగు కలిపిన అన్నమును, కంచుపాత్రలోనుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలుగలవానికి/బ్రాహ్మణునకు యిచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండ వైశాఖ మాస వ్రతము నాచరించినచో వాని సర్వపాపములును పోవుటయేకాక, వాని వంశమున నూరుతరములవారు పుణ్యలోకములనందుదురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు.

అని శంఖముని కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలపై బడెను అందరు ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుండి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.

Thursday, May 30, 2013

వైశాఖ పురాణం - 24

24వ అధ్యాయము - వాయుశాపము

అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.

శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.

శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.

బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.

ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.

అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.

స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.

శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెరును ప్రాణమును తిరస్కరింపలేరు.

ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.

అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.

ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

Wednesday, May 29, 2013

వైశాఖ పురాణం - 23

23వ అధ్యాయము - కిరాతుని పూర్వజన్మ

నారదుడంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.

కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, దుష్టులైనను చెప్పుదురు కదా!

గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా! దయాశాలీ! సజ్జనుడా! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది, నీకు విధేయుడనగుటవలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.

శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి యిట్లనెను.

కిరాతుడా! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు, నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను, నేను చూచిన దానిని, విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.

అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ! యిచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి యిట్లనెను.

నాయనా! కిరాతా! ధర్మతత్పరా! నీకేధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు, ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.


అప్పుడు కిరాతుడు స్వామీ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుంది యిట్లనెను.

ఓయీ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి, యుత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.

ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును, భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.

ఓయీ కిరాతా! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు 'నాధా! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.

ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె యింటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన యిష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును యిచ్చెను. మరునాటి యుదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని యిన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.


నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

Tuesday, May 28, 2013

వైశాఖ పురాణం - 22

22వ అధ్యాయము - దంతిల కోహల శాపవిముక్తి

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.

శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.

పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.

అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.

శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.

శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.

కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు మంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.

ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.

కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.

Monday, May 27, 2013

వైశాఖ పురాణం - 21

21వ అధ్యాయము - పాంచాలరాజు సాయుజ్యము

నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.

పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి  నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.

నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1
ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2
సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3
తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4
ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5
భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6
తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7
వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8
తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9
ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10
నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11
త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12
నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13
పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14
పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15
సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16
సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17
ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18
అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19
ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20
భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21
ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22
కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23
హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24
త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25
అని స్తుతించెను.

పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే. 
  1. స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.
  2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.
  3. స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.
  4. తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.
  5. స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.
  6. నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.
  7. ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.
  8. ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.
  9. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.
  10. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.
  11. స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.
  12. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.
  13. స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.
  14. నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.
  15. స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.
  16. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.
  17. ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.
  18. స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.
  19. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.
  20. జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.
  21. ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.
  22. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.
  23. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.
  24. నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.
  25. ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.
ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును. ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.


వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.

పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.

Sunday, May 26, 2013

వైశాఖ పురాణం - 20

20వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి

నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.

పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.

వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.

రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.

బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.

నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.

అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.

నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.

రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.

Saturday, May 25, 2013

వైశాఖ పురాణం - 19

19వ అధ్యాయము - పిశాచత్వ విముక్తి

నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.

శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.

వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.

పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.

వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో, తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.

విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము, ధ్యానము, మననము, ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము, విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని, విష్ణుకథగాని, సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.

ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన యిష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ యింటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.

ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు యెండిన పెదవులు, నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.

ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని సిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా యదృష్టవశమున మీ దర్శనమైనది. నాను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై బడి దుఃఖించెను.


సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను. ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు-సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.

శ్రుతకీర్త మహారాజా! కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు యిహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు యిహము, పరము, నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |
తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||
ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |
కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||
ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |
బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.

Friday, May 24, 2013

వైశాఖ పురాణం - 18

18వ అధ్యాయము - విష్ణువు యముని ఊరడించుట

నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.

యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవరు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా! యమధర్మరాజా! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి/సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.

అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు యిద్దరును శ్రీహరికి నమస్కరించిరి.

శ్రీహరియు వారిద్దరిని జూచి "మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని యేల నుండెను? బ్రహ్మ! యీ విషయమును చెప్పుమని" యడిగెను.

అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని, బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతీమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను?

యమధర్మరాజా! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలదిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా! అప్పుడు నీకు వలసి నంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా! (ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము) వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున యమధర్మరాజా! నీకు యీ విధముగా భాగము నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుపుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగముగ గ్రహింపుము. ఇట్లు చేయనివారి వైశాఖకర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపముల ననుసరించి నీ లోకమున నుందురు. ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నాయాజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖవ్రతమున నీకు అర్ఘ్యమునీయనివారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నామాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము నిప్పించును. అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగనే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి యా విషయమును చెప్పెను.

శ్రీహరి యీ విధముగ యమధర్మరాజు నూరడించి యంతర్ధానము నందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగినదానికి విస్మయపడుచు తన వారితో గలసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీమహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు, వాని యేలుబడిలోని ప్రజలు అందరును వైశాఖవ్రతము నాచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నానసమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైన అర్ఘ్యము మున్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖవ్రత ఫలమును గ్రహించును.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజింపవలయును, తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు/పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.

ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి యిహలోక సుఖములు, సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే యిది సాధ్యము సుమా అని శ్రుతదేవుదు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు యిక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.

శ్రుతదేవుడును రాజా! యుగములనుబట్టి, కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆకథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

Thursday, May 23, 2013

వైశాఖ పురాణం - 17

17వ అధ్యాయము - యమదుఃఖ నిరూపణము

నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.

వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.

స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యింటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభూ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును, పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని యిప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాతించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్యమును నిర్వర్తింపలేకున్నను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగసాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరియింకను పెక్కు పాపములను చేసినవారు యిట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు, తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు, తాతలు, తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును, తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు, తల్లివైపువారు మొత్తము యిరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును, భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము యిరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్దమున మరణించినవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా! జగత్ర్పభూ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన యీ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ యిష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము. అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.

కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడుకదా! ఇట్లు నా వ్రాత నెవరును యింతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.

Wednesday, May 22, 2013

వైశాఖ పురాణం - 16

16వ అధ్యాయము - యముని పరాజయము

అప్పుడు నారదమహర్షి 
యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.

యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో 
మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.

అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.



సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ
త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా
త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||
నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః
తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||

అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.

అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖ
ములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.

ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుం
వలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.

దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని
నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డ్గించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు 'అయ్యో' అని అతిదీనముగ బలికెను.

Tuesday, May 21, 2013

వైశాఖ పురాణం - 15

15వ అధ్యాయము - వైశాఖవ్రత మహిమ

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.

శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.

వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.

అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.

అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.

వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహికరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని సిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.

ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.