Thursday, March 7, 2013

మాఘ పురాణం - 27

27వ అధ్యాయము - సులక్షణ మహారాజు కథ


గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణు రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.

నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును, పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి, కృతఘ్నునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను, అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే యింతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుదు రాజు నాకు సంతానము కలుగునుపాయము చెప్పుడని వారి ప్రార్థించెను. అప్పుడా మునులోక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి యింటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి, తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్బపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.

అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి యింటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు, వనమున, జలమున, గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని యింటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకావనమున యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య,ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట, తులసిని జూచుట, తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన యిట్టి సానుభూతిని యితరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ, గోవింద,  అచ్యుత మున్నగు భగవన్నామముల యుచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన యిండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన యింట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో యిహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము

సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.

మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.

సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పెరిడెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై యిహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.

No comments:

Post a Comment