Friday, July 11, 2014

గోదా చతుశ్లోకి

నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా |
కాంతోయస్యా:కచవిలులితై:కాముకో మాల్యరత్నై: ||
సూక్త్యాయస్యా: శృతిశుభగయా సుప్రభాతా ధరిత్రీ |
సైషాదేవీ సకలజననీ సించతాత్ మామపాంగై: || 

మాచేత్తులసీ పితా యదితవ శ్రీవిష్ణుచిత్తో మహాన్ |
భ్రాతాచేద్యతిశేఖర: ప్రియతమ:శ్రీరంగధామా యది ||
జ్ఞాతారస్తనయా:త్వదుక్తి సరసస్తన్యేనసంవర్ధితా: |
గోదాదేవి! కథంత్వమన్యసులభా సాధారణా శ్రీరసి ||

కల్పాదౌ హరిణాస్వయంజనహితం దృష్ట్వైవ సర్వాత్మ్నాం |
ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం ||
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యేపురే |
జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమ: ||

ఆకూతస్యపరిష్క్రియాం అనుపమా మాసేచనం చక్షుషో: |
ఆనందస్య పరంపరాం అనుగుణాం ఆరామశైలేశితు: ||
తధ్ధోర్మధ్య కీరీటకోటిఘటిత స్వోచ్చిష్ట కస్తూరికా |
మాల్యామోదసమేధితాత్మ విభవాం గోదాముదారాంస్తుమ: ||

Thursday, July 10, 2014

రుక్మిణీ కళ్యాణం

కాకుత్స వంశమునకు అలంకారమైనటువంటి వాడవు, ప్రజలను ఆనందపరుచు సుగుణమును కలిగిన రాజువు, ఇంద్రాది దేవతలందరునూ శ్లాఘించినటుల యుద్ధమొనరింపగలవాడవు, శివుని యొక్క ధనుస్సును విరచినటువంటి వాడవైన ఓ శ్రీరామచంద్రా! నీకు ప్రణతులు.

ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము రైవతుడను మహా రాజు, రేవతీ అనే నామముగల కన్యకా మణిని గొనివచ్చి బలరామునకు ఇచ్చియు పెండ్లి గావించినాడు. ఈ విషయమంతయునూ ఇంతకు పూర్వమే నీవు ఆలకించి యుంటివిగదా!

అటుల ఆ బలరాముని వివాహానంతరమే పూర్వము పక్షిరాజగు గరుత్మంతుడు దేవేంద్రునిపై జయమునొంది అమృతాన్ని తన సొంతము చేసికొనినట్లుగ చేరి దేశమును పరిపాలన చేయుచున్న శిశుపాలుని, అతని పక్షమును వహించియున్న సాళ్వుడు ఆదిగాగల రాజులందరినీ జయించి చక్రాయుధమును ధరించినవాడు, శుభకరుడూ అగు శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు యొక్క కుమార్తెయగు రుక్మిణిని వివాహం చేసికొనినాడు. ఆ రుక్మిణీ పద్మమును పోలిన దేహపరిమళము గలదియై, లక్ష్యంతో జన్మించింది. అధిక సుగుణముల రాశి, కన్యలలో శ్రేష్ఠమైనది.

ఇటుల శుకయోగీంద్రులు వచించగా పరీక్షిన్మహారాజిట్లు పలికెను. "ఓ మునీశ్వరా! గతములో గోవిందుడు స్వయంవరమున కేతెంచి ఆ రుక్మిణీ దేవిని రాక్షసవివాహ ప్రక్రియన తీసుకువెళ్ళెనని జెప్పియుంటివి. అతనొక్కడే సాళ్వాది నరపతుల నోడించి ఏ విధముగ ద్వారకానగరమునకు ఆమెను తీసుకొని వెళ్ళినాడు?

విప్రోత్తమా! శుభప్రదములైన శ్రీహరి కథాశ్రవణము వల్ల మనోవికారాలన్నీ నాశనమౌతాయి. అంతటి ఆ గాథల నాలకిస్తూ 'ఇకచాలు' అని ఎవరు తృప్తి నొందగలరు? ఆ గాథలు ఎన్ని పర్యాయాలు విన్నప్పటికీ నూతనంగానే ఉంటాయి. అందుచేత నాకు రుక్మినిణీ కల్యాణగాథ వినిపింపుము. వినాలని మనసునందు ఉబలాటముగా ఉన్నది.

గరుడవాహనుని యొక్క శుభగుణములను వర్ణించెడి సంభాషణలు కర్ణములకు ఆభరణములవంటివి. అవి పండితులకు ముదమును చేకూరుస్తాయి, జన్మజన్మల పాపాలను నశింపజేస్తాయి.

ఓ రాజా! వినుము. విదర్భదేశమునందు కుండిన అనే నగరముంది. దానిని భీష్మకుడనే రాజు పాలిస్తూండేవాడు, ఆయన వీరుడు, గొప్పరాజు, ఆయనకు ఐదుగురు పుత్రులు, జ్యేష్ఠుడు రుక్మి అతడు నీతిమాలినవాడు. ఈ ఐదుగురు పుత్రుల పిమ్మట ఆ రాజుకు ఒక పుత్రిక జన్మించింది. ఆమె 'రుక్మిణి' అన్న పేరుతో పేరుగాంచింది.

నెలపొడుపు వలన పశ్చిమదిశ శోభిల్లినటుల రుక్మిణి జన్మించి పెరుగుతూండగా ఆ భీష్మక మహారాజు మందిరం దేదీప్యమానమై వెలుగొందింది.

ఆ విధంగా రుక్మిణీ దినదిన ప్రవర్థమానురాలవుతూ, బొమ్మలకు పేర్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తూ తోటిబాలికలతో వియ్యము చేస్తూ ఉండేది. పప్పు, బియ్యాలను గిన్నెలయందుపోసి కమ్మనైన గుజ్జనగూళ్ళను వండి తన స్నేహిరాండ్రకు వడ్డించేది. అందమైన ఉద్యానవనములందలి పుష్పలతలకు నీరుపోసి ఎరుపువేసి, పందిళ్ళు నిర్మించి, పోషణ గావించేది. స్వచ్ఛమైన మణిమయ భవంతులలో బంగారపు ఉయ్యాలలో ఊగుతూ ఉండేది. చిలకలకు, గోరువంకలకు మాటలను, నెమళ్ళకు నాట్యములు, హంసలకు నడకలనూ నేర్పుతూండేది.

దేవకీపుత్రుడైన శ్రీక్రిష్ణునకు రుక్మిణీని వివాహమాడవలెనన్న కోరిక కొనలు సాగినట్లుగ ఆమెకు సన్నని తీగవలె శరీరము పెరుగుతున్నది. గోవిందుని హృదయం వికసించిన రీతిగ ఆమెకు వదనసరోజము మిక్కిలి కాంతినొందింది. మాధవుని మనసులో ప్రేమ అధికమైనటుల ఆమెకు వక్షద్వయం బిగువైనది. శౌరికి ధైర్యం సన్నగిల్లిన రీతిన ఆమెకు నడుము సన్ననయింది. పద్మనాభునకు అధికప్రేమ ఉన్నటుల రుక్మిణికి శిరోజముల వృద్ధికాసాగింది. గోవిందునకు హృదయమునందు అధిక ముదమునందిన రీతిన ఆమెకు యవ్వనంవృద్ధి నొందినది.

ఇవ్విధమున రుక్మి, రుక్మరధుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే ఈ ఐదుగురుకు తోబుట్టువైన రుక్మిణిదేవికి తొలి యవ్వనంలో తన తండ్రి గృహమునకేతెంచుచున్న అతిథులవల్ల శ్రీకృష్ణుడైన రూప, బల, సద్గుణాలను ఆలకించి వుండుటవలన అతడే తనకు తగిన మగడని నిర్ణయించుకున్నది.

శ్రీకృష్ణుడునూ కన్యకామణియైన రుక్మిణి యొక్క రూప, వివేక, సత్ప్రవర్తనాది, శుభలక్షణ, సద్గుణాలన్నీ గ్రహించి ఆమెకు తప్పక వివాహము చేసికొనాలని నిర్ణయించుకొనినాడు.

ఈ విధంగా పరస్పరము వారు తీర్మానించుకున్న సమయంలో బంణ్ధువులందరూ కూడా రుక్మిణిని కృష్ణునకిచ్చి వివాహంగావించ నిశ్చయించు కొనినాడు. దుష్టస్నేహములు కల్గిన జ్ఞానరహితుడైన రుక్మి మాత్రము కృష్ణునిపట్ల విరోధభావం కలిగివున్నాడు. అతదు బంధువులను వారించి చక్కని శుభలక్షణ లక్షితయైన తన చెల్లెలిని చేది దేశాధిపతి అయిన శిశుపాలునకీయవలెనని సంకల్పించినాడు.

రుక్మిణీదేవి అన్న యొక్క దురాలోచన గ్రహించి రానున్న ప్రమాదమును ఊహించి మనసునందు మిక్కిలిగా వ్యధనొందినది. తనశ్రేయమును వాంఛించే అగ్నిద్యోతనుడను బ్రాహ్మణును పిలిపించి అతనితో 'ఓ విప్రోత్తమా! గర్వాంధుడైన నా అన్న రుక్మి నన్నిపుడు శిశుపాలున కిచ్చుటకు సంకల్పించి నాడు. ఎలాగైనా నీవు ద్వారక కేగి ఆ కృష్ణునకు నా పరిస్థితిని తెలిపి అతనిని ఇచటకు తప్పక పిలుచుకొని రమ్ము అని మరికొన్ని రహస్యములను అతనికి చెప్పి పంపింది.

ఆ పలుకులను విన్న అగ్నిద్యోతనుడు వెనువెంటనే ద్వారకకేగినాడు. తన ఆగమనాన్ని వార్తాహరుల ద్వారా లోపలికి పంపి కృష్ణ నివాసభవనాన్ని ప్రవేశించాడు. అక్కడ స్వర్ణభూషిత గద్దెపై ఆసీనుడై ఉన్న కృష్ణుని గాంచి 'పెండ్లికుమారుడవు' కమ్మ్ని ఆశీర్వదించినాడు. వెంటనే కృష్ణుడు అతని సర్వోపచారముల పూజించి, షడ్రసోపేత విందుభోజనం పెట్టించి, అతని ప్రక్కనుచేరి అతనికి పాదసేవచేస్తూ ఆ బ్రాహ్మణునితో "విప్రపుంగవా! నిత్యసంతోషివైన నీ ప్రవర్తన అనుసరణీయం. బ్రాహ్మణుడు అల్పసంతోషి, తన ధర్మాన్ని తాను నెరవేరుస్తాడు. ధర్మాతిక్రమణం చేయడు. అట్టివానికి సమస్తమూ లభిస్తాయి. శాంతస్వరూపులు, గంధర్వహితులూ, సమకూడిన దానితో సంతోషించే వారూ, అయిన సత్పురుషులకు నేను అభివందనం చేస్తాను. ఆర్యా! మీది ఏ దేశం? మీ యోగక్షేమాలు విచారించే రాజేవరు? నీమనోవాంఛ ఏమిటో సెలవిమ్ము తప్పక తీరుస్తాను", అన్నాడు.

అప్పుడు ఆ బ్రాహ్మణుడు వినయముతో "దేవా! విదర్భ దేశాన్ని పాలించే భీష్మకునకు రుక్మిణి అనే పేరుగల కూతురు ఉన్నది. మిమ్ములను వివాహ మాడగోరి ఈ శుభవార్త మీ కెరిగింపనన్ను నీ వద్దకు పంపినది. సందేశాన్ని ఆలకించండి.

కంసాంతకా! నీ గుణ విశేషములు వినినచో శారీరక తాపాలన్నీ నశిస్తాయి. ఓ కళ్యాణ స్వరూపా! నీ దర్శనభాగ్యం నేత్రానందకరము. నిరంతరం నీ పాదసేవనం లోకమందు మహోన్నతిని ప్రసాదిస్తుంది. నీ దివ్యనామస్మరణ మూలమున భవబంధాలు తొలగుతాయి. నీవు ధన్యుడవు. వంశము, విద్య, అందము, యవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యాలనే గుణ సంపదలతో శోభిల్లుతున్నావు. ఇట్టి నిన్ను ఏ కన్యక వరించక వుండగలదు? స్త్రీలలో ఉత్తమురాలైన శ్రీమహాలక్ష్మి ఆనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతినే నిన్ను ప్రేమించానా ఏమి?

ఓ మంగళదాయకా! పురుషులందు సింహమువంటి వాడవైన నీకు చెందవలసిన నన్ను మదోన్మత్తుడైన ఆ శిశుపాలుడు త్వరితగతిన నన్నపహరింప ప్రయత్నిస్తున్నాడు. అల్పుడైన అతడు నీఘనపరాక్రమమును గూర్చి ఎరుగడుకదా!

పూర్వజన్మములయందు నేను లోకశుభంకరుడూ, ఆ జగన్నాయకుడూ అయిన గోవిందుని పతిగా వాంఛించి నోములు నోచి ఉన్నచో దానధర్మాది పుణ్యకార్యాలు సల్పి ఉన్నచో ఆ శ్రీకృష్ణుడు నాకు పతియగుతాడు. శిశుపాలాది నీచులు యుధ్ధ మందు పరాజితులౌతారు.

ఓ పద్మనాభా! నీకిక్కడ ఆటంకమేమీలేదు. చతురంగ బల సమేతుడవై ఏతెంచి శిశుపాల జరాసంధులను ఉగ్రరణమునందు ఓడించి రాక్షసవివాహ పద్ధతిన నన్ను గొనిపొమ్ము. నేను నీవెంట వచ్చుటకు సిద్ధముగానే ఉన్నాను.


రుక్మిణీ! నీవు అంతరంగిక అంతఃపురమునందు ఉంటావు కదా? నిన్నేరీతిన గొనిపోగలను? ఆ విధముగ గొనిపోవలెనంటే నీ బంధు జనమునూ, అంతఃపుర రక్షకులను వధించవలసి వచ్చును కదా! అని, నీరజాక్షా నీవు భావించిన ఈ రభసతో పనిలేని ఒక ఉపాయాన్ని మనవి చేసెద ఆలకించు. పెండ్లికి ముందుగా పెంద్లికూతురును మా ఇలవేల్పయిన ఆ గౌరీదేవిని కొలిచేందుకై మావారునన్ను ఊరివెలుపల ఉన్న దుర్గగుడికి పంపుతారు. ఆ తరుణమునందు నన్ను నీవు నీవెంట గొనిపొమ్ము.

మహాత్ములు అజ్ఞానరాహిత్యానికై ఆ పరమపురుషుని పాదపద్మముల యందు ద్భవించిన గంగాజలమునందు ఓలలాడ ఆశిస్తారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకున్నచో బ్రహ్మ చర్యనిష్టను బూని నూరుజన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ ప్రాణాల్ని నీకు అర్పితం చేస్తాను. ఇదే నామనోనిశ్చయం.

నీ మధుర వాక్కులాలకించని చెవుల వల్ల ప్రయోజనంలేదు. నీ వనుభవింపని ఈ శరీరలావణ్యం ఎందుకూకొరగాదు. నీ అథరసుధార సమాస్వాదింపని నాలుకకు ఫలరసాదుల ప్రాప్తి ఎందుకు? నీ పాదచర్య కుపకరించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా లాభశూన్యము?


ఈ రీతిన అగ్నిద్యోతుడు ఆ రుక్మిణీదేవి పంపిన సందేశ విశేషాలను కృష్ణునకు విన్నవించి. "కర్తవ్యాన్ని మీరే యోచించాలి" అని అతడు మరల రుక్మిణీదేవిని గూర్చి ఇలా వర్ణిస్తాడు.

రుక్మిణీదేవి చరణాలు, చిగురుటాకుల అందాన్ని మించుతాయి. బంగారపు అరటిబోదెల మాదిరిగా ఆమె తొడలు శోభిస్తాయి. శంఖం మాదిరి ఆమె కంఠం మిక్కిలి అందమైనది. నడుము ఉందాలేదా అనిపిస్తుంది. వక్షద్వయం కనులపండుగ గావిస్తుంది. నెన్నుదురు నెలవంకను అపహాస్యం చేస్తుంది. చూపులు మన్మధబాణాలు వాక్కులు, మనస్సంతోష సంధాయకాలు. వదనం చంద్రబింబం.


కృష్ణా! మా పెద్దలపై ప్రమాణమొనరించి చెబుతున్నాను. నీవూ రుక్మిణీ ఈడూజోడై ఉంటారు. మీకు తప్పక వివాహం జరుగుతుంది. ఆలస్యమిక ఎందులకు? నీవు నీవారితో కలిసి ఆమెను గొనినేని వెంటనే ఉపక్రమించు. శత్రువర్గాన్ని అణచివేసి, లోకానికి హితమును చేకూర్చుము.

శ్రీకృష్ణుడు రథారూఢుడై కుండిన నగరమునక కేగుట

ఈ రీతిన పలుకుతున్న ఆ విప్రపునివల్ల విదర్భ రాజు కుమారి పంపిన వార్త. ఆమె రూప, లావణ్యములను చేయి పట్టుకొని అతనితో ఓ పురుషోత్తమా! రుక్మిణిపై నాకు మిక్కిలి కోరిక రుక్మిణి పెండ్లికి ఓర్చలేక దురాలోచనతో వున్నాడని నాకు ముందే తెలియును. ఆ శత్రువర్గాన్నిఛేదించి కన్యకామణిని గైకొందును.


నేను విదర్భకేతెంచి కుండిన నగరమందు ప్రవేశించి క్షణంలో రుక్మిణీని తెస్తాను. విరోధులెవరైనా అడ్డగిస్తే వారిని యుద్ధంలో హత మారుస్తాను.

కృష్ణుడీవిధంగా పలికి వివాహముహూర్త సమయం అగ్నిద్యోతనుని ద్వారా తెలుసుకొన్నాడు. తన ఆజ్ఞానువర్తియైన సారధి దారుకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక అనే నాలుగు గుఱ్ఱాలను ఉంచిన రథాన్ని అధిరోహించి అగ్నిద్యోతనుని వెంటనిడుకొని ఏకరాత్రి పయనించి విదర్భకు విచ్చేశాడు. అక్కడ రాజైన భీష్మకుడు కుమారునకు లోబడి తన కుమార్తెను శిశుపాలునకిచ్చుటకు అంగీకరించిన శుభకార్య ప్రయత్నాలొనరింపసాగాడు.

నగరమంతటినీ అలంకరించి, మంచి గంధాన్ని కలిపిన నీటిని అంతటనూ చల్లినారు. పలువిధములైన పుష్పతోరణాలు కట్టినారు. ఇండ్లనన్నిటినీ శుభ్రపరచి కర్పూర, కుంకుమలతో రంగవల్లులను తీర్చినారు. పలు మంగళ వాయిద్యాలను ముదమార మ్రోగించారు. పట్టణమంతా అధికమగు వైభవంతో శోభిల్లింది.

పిమ్మట భీష్మకుడు శాస్త్రోక్తరీతిన పితృదేవతాపూజల నొనర్చి భూసురుల పూజించి వారలచే మంగళాశీర్వాదములను పఠింపచేశాడు. రుక్మిణికి అభ్యంగన స్నానమొనరింపచేసి ఆమెను వస్త్రాభరణములతో అలంకరింప జేశాడు. బ్రాహ్మణులు చతుర్వేద సహిత మంత్రాలతో స్వస్తి పుణ్యాహవాచనలు చేసి వివాహ మహోత్సవం నిర్విఘ్నంగా సాగేందుకు రక్షాకరణములు గావించినారు. గ్రహ శాంతికై వేదోక్త విధానహోమమును పురోహితులు చేశారు. రాజు నూతన దంపతుల క్షేమమునకై నువ్వులు, గోవులు, సువర్ణ రజతములు, వస్త్రములు, బ్రాహ్మణులకు దానమొనరించినాడు.


బంధుసహితులైన బలరామకృష్ణులను తరిమికొట్టి ఎట్టి ఆటంకంఅమూ లేకుండా రుక్మిణిని శిశుపాలునకిచ్చి వివాహం చేస్తామని జరాసంధ, దంతవక్త్ర, సాళ్వ, విధూరక మొదలైన వారు చతురంగ బలాలతో ఏతెంచారు మరియు పలుదేశాల రాజులు అనేకులు వచ్చారు. భీష్మకుడు శిశుపాలున కెదురేగి తగినరీతిని పూజించి అతనికి తగిన విడిదిని ఏర్పరచాడు. ఈ సమాచారాన్ని బలరాముడు విన్నాడు.

కృష్ణుడొక్కడే వెల్లినాడు, శిశుపాలునకు  జరాసంధుడు, అనేకులైన రాజులు సహాయంగా ఉన్నారు. కన్యకను గొనివచ్చేటప్పుడు యుద్ధం జరుగుతుంది. మహాత్ముడైన శ్రీకృష్ణునికి సహాయపడవలెనని హలధారుడైన బలరాముడు అసంఖ్యాక సైన్యముతో బయలుదేరి విచ్చేసినాడు.

ఆ సమయమున రుక్మిణీ ఏకాంతమందిరమున కూర్చుని ఆ యదు వల్లభుడు తనను చేరరాడేమోనను సందేహముతో అంతరంగమందు అందోళన చెందసాగింది.

సుమూహూర్తము మరునాటి దినమే. వివాహము దగ్గర పడుతున్నది. కృష్ణుడెందుకు రాలేదు? నా మనసు ఆందోళన పడుతున్నది. ఆయనకు వార్త చేరినదో లేదో? దైవ నిర్ణయమెలా ఉందో ఏమో?

ఆ విప్రోత్తముడు ద్వారకకు వెళ్ళెనో? లేదో? మార్గమధ్య మందే నిలచిపోయెనో? కృష్ణుడు నా సందేహాన్ని విని తప్పుగా భావించినాడేమో? లేక ఇచటకే వచ్చియుండెనో? పరమేశ్వరుడీ కార్యమున కనుకూలించునో? లేదో? గౌరీమహాదేవి నన్ను కాపాడునో? లేదో? ఇంతకునూ నా అదృష్టమెటులున్నదో ఏమో?

ఈ రీతిన పలురకాలుగా యోచిస్తుంది. అగ్నిద్యోతనుడు ద్వారకాపురి కసలు వెళ్లి ఉండదు. కనుకనే శ్రీకృష్ణుడు రాలేదని సందేహిస్తుంది. అన్న నీతిమాలి తనను శిశుపాలునకిచ్చేందుకు సిద్ధపడినాడని విచారిస్తుంది. పరమేశ్వరికి తనపై నేడు కృప తప్పిందని చింతిస్తుంది.

ఆ రుక్మిణీ తన మనోవేదనను తల్లికి చెప్పదు. దిక్కుల యందు చిరునవ్వు వెన్నెలలు చిందింపదు. ముఖపద్మసౌరభానికి ముసురుతున్న తుమ్మెదల గుంపును తోలదు. నిద్రపోదు, వక్షస్థలమందు మెలిపడిన ముత్యాలదండ చిక్కుసడలింపదు.

కనులనుండి కారే కన్నీటి బొట్లు తుడవదు, కొప్పు చక్కగా సవరించుకోదు. స్నేహితురాలితో ముచ్చటింపదు. అన్నమును అసలు ఆరగింపదు. మంచినీరైనా ముట్టదు. చెలికత్తెలను చేరదు. వీణాతంత్రులను మీటుతూ ఆనందింపదు.

మురళీధరుడు తన మొరాలకించి తనను గైకొనరాడాయె? ఒంటికి కస్తూరి పూసికొనదు. జడలో పువ్వులనలంకరింపదు. జలక్రీడలాడదు, నుదుట తిలకమును దిద్దదు.


ఈ విధముగా రుక్మిణీదేవి మదనాగ్ని జ్వాలలలో మ్రగ్గెడి శారీరముగలదై, మందమారుతాన్ని అంగీకరించక కోయిల కూతకు కోపాన్ని వహిస్తుంది. వెన్నెల వేడికి కలత చెందుతుంది. గున్నమామిడి నీడలకు దూరముగా వెడుతుంది.

ఇటుల ఆ పద్మాక్షుని రాకకై ఎదురుచూస్తూ అవసర కృత్యాలపై కూడా కోరిక లేక మన్మధాగ్నితో మ్రగ్గెడి ఆమెకు శుభశూచకంగా ఎడమకన్ను, ఎడమభాగం అదిరాయి. అచ్యుతుని ఆజ్ఞానువర్తియై శీఘ్రమేవచ్చిన అగ్నిద్యోతనుని ముఖలక్షణాల గమనించిన రుక్మిణి మందస్మితయై అతని కెదురేగింది. అపుడాతను ఆమెతో!


"ఓ బాలామణీ! నీ సద్గుణాలను ఆ సుదర్శనాయుధుడు మెచ్చుకున్నాడు. నాకు అమిత ధనరాసులనొసంగినాడు. ఇదిగో ఇప్పుడే విచ్చేసినాను. దేవదానవులు ఏకమై అడ్డువచ్చినప్పటికీ రాక్షసవివాహరీతిన నిన్ను గొనిపోతాడు. నీ సత్ప్రవర్తన, అదృష్టము నేటికి ఫలించినవి తల్లీ"! అని అన్నాడు.

అగ్నిద్యోతనుని పలుకులు వినిన ఆమె అతనితో "బ్రాహ్మణ వంశ శ్రేష్ఠుడా! నా సందేశాన్ని శ్రీకృష్ణుని తోడ్కొని వచ్చితివి. నన్ను ప్రాణాలతో నిలిపితివి. నీవంటి పుణ్యాత్ములీ పుడమియందు లేరు. నీవొనర్చిన ఈ ఉపకారమునకు ప్రత్యుపకారమేమి చేయాలో ఎరుగని దానను నేను. ఓ భూసురోత్తమా! నీకు దోసిలొగ్గి ప్రణమిల్లుతాను" అని పలికినది.

అంత భీష్మకుడు బలరామకృష్ణులు తన కుమార్తె వివాహమున కేతెంచిరని తెలిసి మంగళవాయిద్యములతో ఎదురేగి శాస్త్రోక్తరీతిన వారిని సత్కరించి, మధుపర్కాలిచ్చి, సైన్యసమేతులైన ఏతెంచిన ఆ రామకృష్ణులకు వెంటనే సమస్త సౌకర్య సహితమైన విడుదల నేర్పాటు చేశాడు. ఈ విధముగా అచటకేతెంచిన రాజులందరికీ వారు ఆశించిన వస్తు సముదాయాన్ని సమకూర్చి వారందరినీ ఆదరించాడు భీష్మకుడు. ఆ విదర్భనగర ప్రజలు శ్రీకృష్ణుడు రాకను విని వచ్చి తన సౌందర్యాని ఆస్వాదిస్తూ! "ఈ చక్రి విదర్భరాజు తనయకు తగినవాడు. ఆహా! ఎంత చక్కని దాంపత్యం! వీరల నిరువురినీ ఆలుమగలుగా జతకూర్చిన ఆ బ్రహ్మ ఎంతనేర్పరి! ఈ చక్రాయుధుడు శత్రువుల పారద్రోలి మా రాకుమారిని వివాహమాడుగాక! అని వారందరూ అలా భావిస్తున్న తరుణంలో ఫాలభాగమునందు ముంగురులు ముసరగా రుక్మిణీదేవి గౌరీదేవిని అర్చించుటకై అంతఃపురము నుండి బయలుదేరింది. కవచధారులైన వీరభటులు పలురకాల ఆయుధాలు ధరించి ఆమెను పరివేష్టించి నడచినారు. బ్రాహ్మణ సువాసినులు పూలు పెట్టుకుని, చందనము పూసుకొని, నూతన వస్త్రములను ధరించి బంగారు ఆభరణములను ధరించి పాటలు పాడుతూ ఆమె ననుసరించారు. చెలికత్తెలు, దాసీలు, బంధువులు ఆమెను వెంబడించారు.

సూత, వందిమాగధులు, గాయకాదులు, కైవారములు గావిస్తుండగా రుక్మిణిని ఆ గోవిందుని పాదపద్మములను హృదయమందు స్మరిస్తూ మందగమనయై అంబికాలయానికి వచ్చింది. కాలుసేతులు కడుగుకొని పరిశుద్ధురాలైన పరమేశ్వరీ సన్నిదికేగగా బ్రాహ్మణముత్తైదువులు పరమేశ్వర సహితంగా భవానికి అభిషేకం గావించారు. గంధాక్షతలు సమర్పించి పుష్ప, వస్త్రాభరణాలలో అమ్మవారిని అలంకరించారు. ధూపదీపాలిచ్చి పలురకాలైన పిండి వంటలతో నైవేద్యమిడి కానుకలర్పించిరి. అనంతరం రుక్మిణీ దేవిని దుర్గాదేవికి మొక్కించారు.

అప్పుడు రుక్మిణీదేవి భవానిని "అమ్మా! గౌరీ శాశ్వతులూ, ఆదిదంపతులూ అయిన పార్వతీపరమేశ్వరులను మిమ్ము మదియందు నమ్ముకొని యుంటిని, భక్తితో సేవించుచుంటిని. అమ్మలందు నీవు మేటివి, దయకు సముద్రము వంటిదానవు. కృష్ణుని నాకు భర్తను గావించుము తల్లీ! నిన్ను నమ్మిన వారికెన్నడూ నష్టమనునది లేదుగదా!" అని వేడుకొంటూ ఆమె దుర్గాదేవికి నమస్సులు అర్పించి భర్తృసమేతులైన బ్రాహ్మణసతులకు ఉప్పు, అప్పములు, తాంబూలములు, మంగళ సూత్రములు, చెరకుగడలను వచ్చి పూజగావించినది.


ఆ ముత్తయిదువలు ఉత్సాహమున దీవించి రుక్మిణీదేవి శిరముపై అక్షతలనుంచారు. ఆ మంగళాక్షలను ధరించి ఆమె శివకామినికి వందనమొనరించి మౌనముగా గుడి నుండి బయటకు వెడలినది.

ఈ విధముగా వెడలిన రుక్మిణి మబ్బుల మధ్యనుండి వెలువడి ప్రకాశించెడి తొలకరి మెరుపువలెనున్నది. చంద్ర మండలం నుండి వెడలివచ్చి సంచరించు హరిణమువలెనున్నది. బ్రహ్మదేవుడనెడి నటుడెత్తిన తెరమరుగుబాసి రంగమున సాక్షాత్కరించిన మోహిని దేవతవలెనున్నది. వాసుకి అనే సర్పరాజు కవ్వపుత్రాడు గను, మందరగిరిని కవ్వముగాను చేసి సురాసురులు చిలికెడివేళ ఘుమఘుమ ధ్వనులతో నిండిన మహాసాగర మధ్యమునుండి ఏతెంచిన రమా రమణివలె విరాజిల్లింది. ఈ విధంగా పలుకాంతుల విలసిల్లుతూ రుక్మిణి కాళికాలయం నుండి బయలుదేరింది. మానస సరోవరము నండు పసిడి తామరలగుంపులొవిహరించే హంసవలె ఆమె మెల్లగా తూలుతున్న నడుముగల రాకుమారి రత్నాంగుళీయకముతో విరాజిల్లెడి హస్తముతో అనుంగుచెలి హస్తం పట్టుకొంది. ఆమె దొండపండు వంటి అధర అరుణకాంతులు మల్లిమొగ్గల వంటి దంతాలకు ఎఱ్ఱదనాన్ని చేకూరుస్తున్నాయి. కందర్పుడు ఒకనుండి పైకితీసి పదును పెట్టి జళిపించిన వేళ తళుకుతళుక్కుమని మెరిసేవాడి తూపుల మాదిరి ఆఎ సుందరమైన చూపులు వీరిధివీరులైన రాజులగుండెలను చెండివేస్తున్నాయి. అందమైన కాలి అందెల రవళి, చెవులకు విందుసేయగా, ఆ సుందరి ముకుందుని రాకకై ప్రతీక్షిస్తూ వీరమోహినియై కాలినడకతో వస్తున్నది.

తుమ్మెదల వంటి నల్లనైన ముంగురులు, నిండుచందురుని వంటి నమ్మోము, లేడిచూపులవంటి చూపులు, పగడమువంటి పెదవి, అవ్యక్తమధురమైన కంఠము, క్రొత్తచిగురుటాకుల వంటి అడుగుల జంట, మత్తగజ కుంభాలవంటి కుచాలు, ఇసుక తిన్నెలవంటి పిరుదులు, గజరాజగమనము వంటి గమనము, కెందామరలవంటి చేతులు, సింహము నడుము వంటి నడుము కలిగి, పద్మసుగంధాలు వెదజల్లే రుక్మిణీదేవిని చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.

అంతేకాక ఆమె చిరునవ్వులవల్లా సిగ్గుతో కూడిన చూపుల వల్లా అక్కడి రాజకుమారులకు మనసులు చలించాయి. వారు ధైర్యాన్ని వీడినారు. గాంభీర్యం వదలినారు. గౌరవం మరచినారు. చేష్టలుడిగి తెలివి మాలినారు. ఆయుధాలు జారవిడిచి, ఏనుగులు, గుర్రాలు, రథాలను ఎక్కలేక భూమిపై వాలినారు. లేడి చూపుల గలిగిన రుక్మిణి తన ఎడమచేతి గోళ్ళతో ముంగురులను ఎగదోసుకొంటూ, పైటను సర్దుకుంటూ కడగంటి చూడ్కులను ఆ రాజసమూహం మీద ప్రసరింపజేసింది.


ఈ విధంగా చూస్తూ చద్రబింబం వంటి ముఖమూ, సింహము వంటి నడుమూ, కొత్తతామరవంటి కన్నులూ, అందమైన వక్షస్థలమూ, నీలిమేఘమువంటి శరీరమూ, ఏనుగు తొండమును బోలిన బాహువులూ, పచ్చని పట్టువస్త్రములు, చక్రాయుధమును కల్గినవాడు, విజయమునందు ఆసక్తి వున్న వాడూ, జగన్మోహనుడూ అయిన శ్రీకృష్ణుని ఆ రుక్మినీడేవి దర్శించినది.


శత్రురాజులు వీక్షించుచుండగనే శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని గొనిబోవుట


ఆ విధంగా చూచి శ్రీకృష్ణుని రూప లావణ్య, గాంభీర్య, నేర్పు, తేజస్సు, ఐశ్వర్యములైన ఈ విశేషాలను హర్షించి ఆమె మదన బాణాలకు గురియై త్వరగా రథ మెక్కేందుకై కుతూహలపడినది. రుక్మిణీదేవిని ఆ పుండరీకాక్షుడు అవలోకించినాడు. శత్రు రాజుల సమూహం చూస్తుండగానే మత్తమాతంగము రీతిన మెల్లనైన విలాసవంతమైన నడకతో చనుదెంచినాడు. సకల రాజలోకాన్ని లెక్కచేయక తిరస్కరించి రాజకుమారిని రథమెక్కించుకున్నాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లునటుల తన యొక్క పాంచజన్యాన్ని పూరించినాడు. బలరాముడు వెంటరాగా శ్రీక్రిష్ణుడు యాదవసైన్యంతో ద్వారకానగరమార్గం వైపు మరలినాడు. ఆ సమయమున జరాసంధునకు లోబడి ఉన్న పాలకులందరూ కృష్ణుని పరాక్రమాన్ని సహించలేక పోయినారు.

అదిగో! ఘనసింహముల కీర్తిప్రతిష్ఠలను ముక్కోటి మృగాలు అపహరించి విధముగా గొల్లవారు మనయశస్సు దోచుకొని కన్యనెత్తుకొని కావరముతో కదలివెళ్ళుచున్నారు. ఇప్పటికి పనికిరాని మన ప్రతాపం మరి ఎప్పటికి మన శస్త్రాస్త్రములను మంటలో వేసేందుకా? సన్ననైన నడుము గల ఆ కన్నియను వారి బారినుండి తప్పించుకున్న సందుగొందులందు సైతము ప్రజలు మనల్ని అపహాస్యం మొనరించరా?

ఇవ్విధమున ఒకరికొకరు చెప్పుకొని రోషమును మనమున కెక్కించుకున్నారు. జరాసంధాది మొదలైన రాజులు చతురంగబల సమేతులై యాదవవీరులను వెంబడించి నిలవండి, నిలవండి, అని ధిక్కరించి హుంకరించి పలికినారు. శరవర్షాన్ని కురిపింపసాగారు. ఆ సమయములో యాదవ సేనాధిపతులు చాపాలను ఎక్కుపెట్టి ధనుష్ఠంకారం గావిస్తూ నిలిచారు.

ఆ సమయమునందు శత్రువీరులు శ్రీకృష్ణుని సేనను బాణాలతో కప్పివేయుటను గాంచిన రుక్మిణి సిగ్గుతో శ్రీకృష్ణుని ముఖావలోకనం గావించింది.


అలా ఆమె చూడగనే శ్రీకృష్ణుడు 'ఓ కమలనయనా! చూస్తూవుండు, మన యాదవవీరులు శత్రుసైన్యాన్ని చెండాడతారు. విరోధులు మరణిస్తారు అని పలుకుతూ రుక్మిణీదేవిని ఊరడించాడు. అపుడు బలరామాది యాదవవీరులు విజృంభించిన జరాసంధాది రాజులపై శరవర్షాన్ని కురిపించారు. ఆ శరవర్షానికి శత్రుసైనికుల శిరములు కప్పులు విరిగిపడినాయి, కాల్బలము కూలిపోయింది. గజ, అశ్వ, రధారోహకుల శిరములు తెగినేలరాలాయి. పుర్రెలు బద్దలయాయి. భుజకీర్తులు వీడిపోయి, గదలు, బల్లాలు, గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, ధనువులు విరిగి ముక్కలైనాయి. జెండాలు, గొడుగులు, వింజామరలు కూలిపోయాయి. రాజుల సమూహం చెదిరింది. నెత్తురుటేరులు ప్రవహించాయి. నక్కలు, కాకులు, గ్రద్దలు, రాబందులు వీటి అరుపులు చెలరేగినాయి. మెదడు, మాంసమును భక్సిస్తూ నెత్తురు త్రాగుతూ ఉన్న డాకిని మున్నగు పిశాచాలకు ఆ రణరంగం ఆనందాన్ని కలిగించింది.

ఆ సమయమునందు భయంతో వెనుదిరిగి పరుగిడుతూ జరాసంధాది రాజులంతా ఒకచోట చేరినారు. కళత్రమును కోల్పోయిన వానివలె విలపిస్తూ, వడిలిపోయిన ముఖంతో తన ఎదుట దుఃఖిస్తున్న శిశుపాలుణ్ని చూచి "శత్రుహస్తములందు బడక ప్రాణాలతో బ్రతికేయుంటివిగదా!" అని ఊరడించారు.

వారందరూ మరల అతనితో ఈ విధంగా అన్నారు. "నాయనా! శరీరంలో ప్రాణాలుంటే ఏ విధంగానైనా బ్రతకవచ్చు. బ్రతికి ఉంటే భార్యలభించకపోదు. భార్యమాట దేవుడెరుగు ముందు నీవు బ్రతుకుటయే మాకు పదివేలు. ఊరికే దుఃఖించవలదు"

అప్పుడు జరాసంధుడీవిధంగా అన్నాడు శిశుపాలా! విను అస్వతంత్రుడైన మానవుడు బొమ్మలాదించే వాని చేతిలో కీలుబొమ్మవలె అతడు ఈశ్వరమాయకు లోనై సుఖదుఃఖాలలో నాట్యమాడుతూ ఉంటాడు. గతంలో నేను పరాక్రమంతో మధురపై 17 పర్యాయాలు దండేత్తగా, నా సైన్యమంతయూ ఓడిపోయింది. నేను బలరాముని చేతికి చిక్కాను. కృష్ణుడు దయతో విడిచిపెట్టగా తిరిగి వచ్చాను. మరల 23 అక్షాహిణుల సైన్యాన్ని సమకూర్చుకొని 18వ సారి దండెత్తిపోయి శత్రువుల్ని తరిమివేసి విజయాన్ని సాధించాను. నేనెప్పుడూ గెలుపోటములతో మోదఖేదములు పొందియుండలేదు. దైవప్రేరితమైన కాలం వల్ల లోకాలు సాగుతుంటాయి.


అంతేకాదు, యాదవులకు కాలం కలిసివచ్చింది. ముల్లోకాలలోనూ ప్రసిద్దిచెంది పరాక్రమవంతులైన మనల్ని గోవిందుని బాహుదర్పమున వరీనాదు విజేతలయ్యారు. కాలం మనకు అనుకూలించినపుడు పగవారిని యుద్దభూమిలో చెండాడగలము దీనికై ఇంతగా చింతింపనవసరములేదు.

ఈ రీతిన జరాసంధుడు అతని సామంతరాజులూ శిసుపాలుని మనోవేదనము తొలగించి తమ తమ దేశాలకేగినారు. శిశుపాలుడు కూడా తన సైన్యముతో తన నగరానికి వెళ్ళిపోయినాడు.

అంతట రుక్మిణి అన్నయైన రుక్మి శ్రీకృష్ణుడు రాక్షస వివాహ విధానమున తన సోదరి నెత్తుకుపోవటాన్ని ఓర్చుకోలేక ఒక అక్షౌహిణిసేనతో యుద్ధమున కాయత్తుడై బయలుదేరి కృష్ణుని వెనుకనే వెళ్లుతూ తన రథసారథితో ఇట్లన్నాడు.

"నేను భీష్మకమహారాజు కుమారుడను, అధిక బలవంతుడనైన నన్ను పిల్లవానిరీతిన చులకన చేసి నా చెల్లిలైన రుక్మిణినిగైకొని ఈ యాదవుడు అసహాయ శూరునివలె నేగుచున్నాడు. మన రథాన్ని అటువైపు నడుపుము, వాడియైన బాణ ప్రయోగముచే వాని పొగరణచి నా పరాక్రమాన్ని ప్రదర్శించెదను".

ఆ విదంగా రుక్మి కృష్ణుని శక్తి సామర్థ్యముల నెరుగక రథమును ఆ వైపునకు నడిపించి "ఓ యాదవా! నవనీతచోరా! క్షణమాగు" అని నిర్లక్ష్యభావమున పలికి ధనుష్ఠంకారమొనర్చి మూడు వాడియైన బాణములతో ఆ పంకజాక్షుని సంకటపరిచి ఇట్లన్నాడు.

ఓ కృష్ణా! మా చెల్లిలిని తీసుకువెళ్ళటానికి నీవు మాతో సమానుడువా? నీవెంతటివాడివి? నీ వంశమెట్టిది? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగితివి? నీ ప్రవర్తన ఎట్టిదో ఎవరికి తెలియదు, నీకు అభిమానం లేదు, స్వస్వరూపంతో వైరివర్గం మీదకు వెళ్ళవు. నీవు క్షత్రియుడవు, వావివరసలు లేవు. నీకు మంచి గుణాలు లేవు. మా చెల్లిలిని వదలిపెట్టు, లేనిచో వాడియైన బాణాలతో నీగర్వం సర్వాన్ని హరిస్తాను"

అలా రుక్మి పలుకుతూండగనే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఒక బాణంతో అతని చాపాన్ని త్రుంచివేసి, ఆరు తూపులతో వాన్ని దేహాన్ని తూట్లు చేశాడు. ఎనిమిది బాణాలతో వాని ర్థాశ్వాలను కూల్చివేసి, రెండుసాయకాలతో వాని సారథిని చంపివేశాడు. మరో మూడు బాణాలతో వాని ధనువును ఖండించినాడు. రుక్మి వేరొక ధనువును అందుకోగా దానిని కూడా విరగగొట్టినాదు. తదుపరి రుక్మి పలురకాలైన ఆయిధాలను ఎత్తినప్పటికీ అన్నిటినీ కత్తిని ధరించి కృష్ణుని సమీపించాడు. శ్రీకృష్ణుడతని కత్తినీ, కవచాన్నీ నుగ్గునుగ్గు గావించాడు. అంత కృష్ణుడు కత్తిని ఝుళిపిస్తూ రుక్మి శిరస్సును నరికేందుకై ముందుకు వస్తూవుండగా రుక్మిణీదేవి అడ్డం వచ్చి ప్రాణేశ్వరుని పాదపద్మములు పట్టుకొని ఇటుల పలికినది.

నాధా! మా అన్న దోషరహితుడని మనవి చేయడంలేదు. అతడు నిజంగా దుష్టుడే. కాని ప్రభూ! జగన్నాయకుడైన అచ్యుతుడు తమకు అల్లుడైనాడని, తాము అదృష్టవంతులమని సంతసించు మా తల్లిదండ్రులు పుత్రదుఃఖంతో పగిలిపోతారు.

ఈ విధముగా ప్రార్థిస్తూ కన్యకామణియైన రుక్మిణీ రుద్ధ కంఠంతో అధిక భయము వల్ల వణుకుతున్న శరీరముతో వాడిన, వంగిపోయిన ముఖముతో చెవులపై పడుచున్న జడ శిరోజాలతో కనులతో తొలకెడి కన్నీటితో నారాయణునకు నమస్కరించి. దివ్యతేజముతో శోభిల్లుతున్న ఈ దేవకీనందనుడి రుక్మిని ఖడ్గముతో ఖండింపక వెనుకకు మరలి

"బావా! రారమ్మని చిరునవ్వునవ్వుతూ దగ్గరకు తీసుకుని వానిని పట్టి బంధించి, గడ్డం, మీసం, తల, కత్తితో పాయలు పాయలుగా గొరిగి కురూపిని గావించినాడు. అదే సమయంలో యాదవవీరులు శత్రుసైన్యాన్ని తరిమివేసి శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. అప్పుడు బలరాముడు జీవన్మృతుడై బంధింపబడియున్న రుక్మిణి చూచి వానికట్లను విప్పి కృష్ణునితో ఇట్లన్నాడు.


మహాత్మా! ఇతనిని దూరముగ పొమ్మని చెప్పక తల, మూతి, గొరుకుట నాకు న్యాయమా? చుట్టమైన వాడి తల, మూతి, గొరుకుట అనునది తల నరుకుటకన్న మిక్కిలి నీచంగాదా? అందరి యెడల సమభావంతో మెలిగిడి నీకు ఈ భేదబుద్ధి ఏల కల్గినదో!


సహోదర భంగమునకు ఖిన్నయైన రుక్మినీదేవిని బలరాముడోదార్చుట


బలరాముడీ విధముగా కృష్ణుని అదలించి రుక్మిణీదేవినిగాంచి ఆమెతో ఇటుల పలికినాడు.

అమ్మా! అన్నగారు అవమానమొందినాడని దుఃఖముతో మా కృష్ణుని నిందించవలదు. గతజన్మములందు చేసిన కర్మములను బట్టి జీవుడు సుఖదుఃఖములను అనుభవిస్తూంటారు. శిక్షణకు రక్షణకు కర్త ఒకడంటూ లేడు. నీ తోబుట్టువు కర్మశేషంతో ఈనాడిక్కడ ఈ విధమిన పరాభవాన్ని పొందినాడు. చంపదగిన నేరాన్ని చేసినప్పటికీ బంధువులను వధింపరాదు. క్షమించి విడచుటయే న్యాయము, చంపితే పాపం చుట్టుకుంటుంది. అసలే అవమాన భారంతో చస్తున్న వాడిని మరలా చంపడమెందులకు?

బ్రహ్మచేత ధరణీపతులకు దండనీతి అనెది విహితకృత్యంగా విధింప బడుతుంది. రాజ్యకాంక్షతో తోబుట్టువును. తోడబుట్టిన వాడే క్రూరహృదయుడై చంపుతుంటాడు.


రుక్మిణీ! విను దేహాభిమానులైన మానవులకు ఇతడు శత్రువు, ఇతదు బంధువు, ఇతడు తటస్థుడు అనే భేదబుద్ది జనిస్తుంది. నీతియందు సూర్యచంద్రులు, ఘటాదులందు ఆకాశము అనేకములుగా గోచరించునతుల ప్రాణులందరికీ ఆత్మ ఒక్కటే అయినప్పటికీ పలువిధాలుగా అగుపిస్తుంది, పుట్టుక, చావుగల ఈ శరీరము పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము, అనే పంచభూతములతోనూ ప్రాణ, ఆసాన, వ్యాన, ఉదాన, సమాన, అనెడి పంచప్రాణములతోనూ సత్వరజస్తమస్సులనే త్రిగుణాలతోనూ కూడినదైన అజ్ఞానముచే ఆత్మయందు కల్పించబడినది. ఈ దేహం జీవుల్ని సంసార చక్రంలో పరి భ్రమింపజేస్తుంది. సూర్యుడు దేనితోనూ సంబంధములేక ఉదాసీనుడైయుండగా, గోచరమయ్యే దృష్టి, రూపం అనేవానివలె ఆత్మ ఉదాసీనుడైయుండగా శరీరమూ మరియు చర్మమూ, చక్షువూ, శ్రోతమూ, జిహ్వ, ఘ్రాణము అను పంచజ్ఞానేంద్రియములు, వాక్కు, పాణి, పాదం, వాయువు, ఉపస్థ అనే పంచకర్మేంద్రియాలూ ప్రకాశవంతమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడికగాని, ఎడబాటుగాని లేదు. హానివృద్ధులు, చంద్రకళలకేగాని చంద్రునికి లేనట్లుగ చావుపుట్టుకలనేవి శరీరానికేగాని, ఆత్మకు కలుగవు. నిద్రించినవాడు విషయాల వలన సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింప జేసేటట్లు, జ్ఞానహీనుడు అసత్యమైన అర్థమునందు అనుభవం కల్గించుకుంటాడు.

రుక్మిణీ! అజ్ఞానము వలన కలిగెడు దుఃఖాన్ని విజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు, నీవు మతిమతురాలవు, అజ్ఞానులమాదిరి శోకించడం నీకు తగదు.

ఈ విధముగా బలరాముదు ప్రభోధ గావించినాడు. రుక్మిణీదేవి తన విచారాన్ని విడిచిపెట్టింది. ఇది ఇట్లుండగా ప్రాణాలతో వదలిపెట్టబడిన రుక్మి తన వికార రూపానికి వ్యధనొందుతూ కృష్ణుని జయించినగాని కుండిన నగర ప్రవేశమొనర్చనని ప్రతిజ్ఞ చేసి పట్టణసమీపమందే వుండిపోయినాడు.

ఈ విధంగా ఆ శ్రీకృష్ణుడు తన రాజసముతో రాజలోకాన్ని జయించి, విభ్రాసమానమైన తన పట్టణానికి బంధువులందరూ స్తుతింపగా ఆ రుక్మిణిని తోడ్కొని వచ్చినాడు.


శ్రీకృష్ణుడు రుక్మిణిదేవిని వివాహమాడుట

అప్పుడా యాదవేంద్రునిపురంలో వివాహపు పనులు ప్రారంభింపబడినవి, గాత్ర, సంగీతములు, వాద్యగానములు, నాట్యములు జరిగాయి. ప్రతి ఇంటియందు స్త్రీ పురుషులందరూ అలంకారములు చేసికొన్నారు. వివాహ మహోత్సవానికి ఆహ్వానాలందుకొన్న రాజులంతా విచ్చేసినారు. వారియొక్క గజ సమూహాల గుండుస్థలాలనుంచి స్రవించిన మదజలాలలో రాజ మార్గాలు తడిసిపోయాయి, మంగళాచారానికై ద్వార పార్శ్వాలలో పోకచెట్లు, అరటిబోదెలు కట్టినారు. కర్పూరకుంకుమలతో రంగవల్లులు తీర్చిదిద్దినారు. అగరధూపాలను వేసినారు. పూర్ణకుంభాలను వుంచారు. వింత వింత పుష్పాలతో రత్న తోరణాలతో రెపరెపలాడెడి పతకాలతో ద్వారకానగరం విలసిల్లింది.

ఈ సుభసమయమున తన మనసునను హరించునదీ, ఆత్మోన్నతీ, గాంభీర్యమూ అనే గుణాలతో ఒప్పునదీ, సకల సంపదలను కలిగించేదీ, సుజనులను, చుట్టములను ఆదరించేదీ, పుణ్యరసంచారిణీ, దారిద్ర్యపరిహారిణీ, కళ్యాణవేషభూషణ ధారిణీ, రమణీ, శిరోమణీ అయిన రుక్మిణిని శ్రీకృష్ణమూర్తి పెండ్లాడినాడు. ఆయన కీర్తిప్రతిష్ఠలు నలుదిక్కులా వ్యాపించినాయి.

అఖండ తేజోవిరాజితులునూ, అపారకృపావర్దిష్ణులూ అయిన రుక్మిణీ కృష్ణులకు ద్వారకా పురవాసులు, తమ భార్యలతో కలిసి మంచి మనసులతో కానుకల గొనివచ్చి సమర్పించినారు.

శ్రీకృష్ణుని వివాహానికి కేకయ, కురు, సృంజయ, యదు విదర్భ, కుంతి, దేశాల రాజులు ఇతర రాజులకంటే అధికమైన ఆనందాన్ని అనుభవించారు.

శ్రీకృష్ణుడీ విధంగా రుక్మిణీదేవిని తెచ్చి పెండ్లాడటం అనన్య సామాన్యమైన కార్యమని ఆయాదేశమునందలి రాజులూ, వారి రాణులూ ఆశ్చర్యమొందినారు.


పాపరహితుడైన ఓ పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో గూడి సుఖిస్తున్న శ్రీకృష్ణుని గాంచిన ఆ పట్టణ ప్రజలందరూ భయరహితులై విరివిగా ముదమంది విలసిల్లినారు అని శుకయోగీంద్రులు పరీక్షినహా రాజుకు రుక్మిణీ కళ్యాణ గాథను వినిపించాడు.