Friday, June 14, 2013

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ మహాగౌరీ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా ||

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ ||

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

Thursday, June 13, 2013

శ్రీ ఆంజనేయ మంగళాష్టకమ్

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || 1

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయచ
మాణిక్యహార కంఠాయ మంగళం శ్రీ హనూమతే || 2

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయచ
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనూమతే || 3

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయచ
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హనూమతే || 4

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే ||5

రంభావన విహారాయ గంధ మాదవ వాసినే
సర్వలోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే || 6

పంచాననాయ భీమాయ కాలనేమి హరాయచ
కౌండిన్యగ్రోత్ర జాతాయ మంగళం శ్రీ హనూమతే || 7

కేసరీ పుత్ర! దివ్యాయ సీతాన్వేష పరాయచ
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీ హనూమతే || 8

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం.

Wednesday, June 12, 2013

చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || 1

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ |
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 2

పంచపాదప పుష్ప గంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్దమన్మధ విగ్రహం |
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం 
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 3

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాం ఘ్రి సరోరుహమ్ |
దేవసింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 4

యక్షరాజ సఖం భగాక్షహరం భుజంగ విభూషణమ్
శైలరాజసుతా పరిష్కృత చారువామ కళేబరమ్ |
క్ష్వేల, నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 5

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ |
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 6

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయఙ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 7

భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్ |
సోమవారుణ భూహుతాశన సోమపాని లఖాకృతి
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 8

విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ |
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః || 9

మృత్యుభీత మృకండు సూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చయః పఠేన్నహి తస్యమృత్యు భయం భవేత్ |
పూర్ణమాయుర్త రోగతా మఖిలార్థ సంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః || 10

Tuesday, June 11, 2013

శ్రీ లక్ష్మీనృసింహ అష్టోత్తర శతనామావళి

ఓం నారసింహాయ నమః
ఓం మహాసింహాయ నమః
ఓం దివ్యసింహాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం ఉగ్రసింహాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం స్తంభజాయ నమః
ఓం ఉగ్రలోచనాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం సర్వాద్భుతాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం యోగానందాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హరయే నమః
ఓం కోలాహలాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం విజయాయ నమః
ఓం జయవర్ధనాయ నమః
ఓం పంచాననాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం అఘోరాయ నమః
ఓం ఘోరవిక్రమాయ నమః
ఓం జ్వలన్ముఖాయ నమః
ఓం మహాజ్వాలాయ నమః
ఓం జ్వాలామాలినే నమః
ఓం మహాప్రభవే నమః
ఓం నిటలాక్షాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం దుర్నిరీక్షాయ నమః
ఓం ప్రతాపనాయ నమః
ఓం మహాదంష్ట్రాయుధాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం చండకోపినే నమః
ఓం సదాశివాయ నమః
ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః
ఓం దైత్యదానభంజనాయ నమః
ఓం గుణభద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః
ఓం బలభద్రకాయ నమః
ఓం సుభద్రకాయ నమః
ఓం కరాళాయ నమః
ఓం వికరాళాయ నమః
ఓం వికర్త్రే నమః
ఓం సర్వర్త్రకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం ఈశాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విభవే నమః
ఓం భైరవాడంబరాయ నమః
ఓం దివ్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం కవయే నమః
ఓం మాధవాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం వరప్రదాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం అధ్భుతాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం శ్రీవిష్ణవే నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అనఘాస్త్రాయ నమః
ఓం నఖాస్త్రాయ నమః
ఓం సూర్యజ్యోతిషే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
ఓం వజ్రదంష్ట్రాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం మహానందాయ నమః
ఓం పరంతపాయ నమః
ఓం సర్వమంత్రైకరూపాయ నమః
ఓం సర్వయంత్ర విదారకాయ నమః
ఓం సర్వతంత్రాత్మకాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సువ్యక్తాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం వైశాఖశుక్ల భూతోత్ధాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం ఉదారకీర్తయే నమః
ఓం పుణ్యాత్మనే నమః
ఓం దండవిక్రమాయ నమః
ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః
ఓం భగవతే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీవత్సాంకాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం ద్విరూపభృతే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నృకేసరిణే నమః
ఓం పరతత్త్వాయ నమః
ఓం పరంధామ్నే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం లక్ష్మీనృసింహాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం ధీరాయ నమః
ఓం ప్రహ్లాదపాలకాయ నమః
ఓం శ్రీలక్ష్మీ నరసింహాయ నమః
ఓం యాదగిరి నరసింహాయ నమః
ఇతి శ్రీ లక్ష్మీనృసింహ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి

ఓం గౌర్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం జగన్నేత్రే నమః
ఓం గిరితనూభవాయై నమః
ఓం వీరభద్రప్రసువే నమః
ఓం విశ్వవ్యాపిణ్యై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం హైమవత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నారాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం హిమాద్రిజాయై నమః
ఓం వేదాంతలక్షణాయై నమః
ఓం కర్మబ్రహ్మామయ్యై నమః
ఓం గంగాధరకుటుంబిన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కలిదోషవిఘాతిన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం మాంగల్యదాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం సత్యై నమః
ఓం సర్వమయ్యై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం కామకలనాయై నమః
ఓం కాంక్షితార్థ ప్రదాయై నమః
ఓం చంద్రార్కాయుత తాటంకాయై నమః
ఓం చిదంబరశరీరిణ్యై నమః
ఓం శ్రీచక్రవాసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కామేశ్వరపత్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మురారిప్రియార్థాంగ్యై నమః
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం పుణ్యాయాయై నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం అచింత్యాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం పురుషార్థప్రదాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం సర్వరక్షిణ్యే నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ప్రత్యంగీరాంబికాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయిణ్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
ఓం శివవాభినామధేయాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః
ఓం హ్రేంకార్యై నమః
ఓం నాదరూపాయై నమః
ఓం సుందర్యై నమః
ఓం షోడశాక్షరదీపితాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం చండ్యై నమః
ఓం భగళాయై నమః
ఓం మాతృకాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
ఓం అంబాయై నమః
ఓం భానుకోటిసముద్యతాయై నమః
ఓం వరాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమః
ఓం సోమశేఖర్యై నమః
ఓం అమరసంసేవ్యాయై నమః
ఓం అమృతైశ్వర్యై నమః
ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
ఓం బాల్యారాధితభూతిదాయై నమః
ఓం హిరణ్యాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం మార్కండేయ వరప్రదాయై నమః
ఇతి శ్రీగౌరీఅష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Wednesday, June 5, 2013

వైశాఖ పురాణం - 30

30వ అధ్యాయము - పుష్కరిణి - ఫలశ్రుతి

నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.

దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని  యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.

శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.

మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.

నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.

ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.

Tuesday, June 4, 2013

వైశాఖ పురాణం - 29

29వ అధ్యాయము - శునీ మోక్షప్రాప్తి

నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.

మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.

పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె యిచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని యారోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని యింట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.

ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి యరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి యరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు.

అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి యేమని పుత్రుని యడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని యాశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు యిట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే యున్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచిదేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా! కావున నేను దీనురాలై అడుగుచున్న యీ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి యుద్దరింతును అని పలికెను.


ఇట్లు పలికి ద్వాదశినాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్ళు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను దెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్యవిమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములననుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవమునుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్దినందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి, యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిధిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిధి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటె సమస్త యజ్ఞయాగాదులకంటె అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వైశాఖశుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.

Monday, June 3, 2013

వైశాఖ పురాణం - 28

28వ అధ్యాయము - అక్షయతృతీయ విశిష్టత

నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.

పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.

ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.

ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.

ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు  చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.

Sunday, June 2, 2013

వైశాఖ పురాణం - 27

27వ అధ్యాయము - కలిధర్మములు - పితృముక్తి

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.

అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలని ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.

పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరునుండరని భావము.

దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు(భార్యలేనివారు), స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును. ఆ తిధినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.

ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.

అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించినవచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.

ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ యీ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.

ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.

భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.

జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.

ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక యెలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన యెలుకగడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.

ధర్మవర్ణుడును దీనులై ,యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను యిది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును యీ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన యీ గడ్డికి అంకురములులేవు. ఈ యెలుక యీ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ యెలుక మిగిలిన యీ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.

కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన యెలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ యెలుకయే కాలము. ఇప్పటికి యీ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు యిందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగువి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.

తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.

ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై యిట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము యిష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.


ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని యెట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణుకథలయందనురక్తి, స్మరణము, సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని యింటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.

ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.

Saturday, June 1, 2013

వైశాఖ పురాణం - 26

26వ అధ్యాయము - వాల్మీకి జన్మ

నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.

తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.

శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.

ఒక వైశాఖమాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.

ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టుతొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.

శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.

ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!

శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను.


ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.

శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు.

అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట  బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను.


అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.

కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.

శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.